తెలంగాణలో తొలిసారిగా జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలలో పోటీ చేస్తోంది. జనసేన తరపున 8 మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇంతవరకు వారి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ‘బీ-ఫారమ్స్ ఇచ్చేశా... ఇక మీదే బాధ్యత’ అన్నట్లు ఉండిపోయారు. దీంతో జనసేన అభ్యర్ధుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.
ఓ పక్క బిఆర్ఎస్ తరపున కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితరులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ తరపున సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, కర్ణాటక సిఎం సిద్దరామయ్య, డెప్యూటీ సిఎం డికె శివకుమార్, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉదృతంగా ప్రచారం చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. బీజేపీ తరపున ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు తరలివచ్చి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
కానీ ఎన్నికల ప్రచార గడువు (28వ తేదీ) దగ్గర పడుతున్నా జనసేన అభ్యర్ధుల తరపున ప్రచారం చేసేందుకు పవన్ కళ్యాణ్ రావడం లేదు. దీంతో మూడు ప్రధాన పార్టీల ప్రచారం మద్య జనసేన అభ్యర్ధుల గొంతే వినిపించడం లేదు. ఈ నెల 25,26,27 తేదీలలో ప్రధాని నరేంద్రమోడీ మళ్ళీ తెలంగాణ పర్యటనలకు వస్తున్నారు. కనుక అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో కలిసి ఎన్నికల సభలలో పాల్గొంటారేమో? కానీ దాని వలన జనసేన అభ్యర్ధులకు ఒరిగేదేమిటి?ఈ మాత్రం దానికి ఎన్నికలలో జనసేనను బకరాగా నిలబెట్టాల్సిన అవసరం ఏమిటి?