వేములవాడ బిఆర్ఎస్ అభ్యర్ధి చల్మెడ లక్ష్మీ నరసింహ రావుకి అన్నీ అపశకునాలే కనిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు పౌరసత్వ వివాదంలో చిక్కుకొని బయటపడలేకపోతుండటంతో ఈసారి ఆయనకు బదులు చల్మెడకి అవకాశం కల్పించారు. దాంతో రమేశ్ బాబు అలిగారు. కేసీఆర్ స్వయంగా ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించినప్పటికీ పట్టించుకోకుండా జర్మనీ వెళ్ళిపోయారు.
ఆయన అనుచరులు కూడా చల్మెడకు సహకరించడం లేదు. దీంతో మంత్రి కేటీఆర్ స్వయంగా పూనుకొని వేములవాడలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. చల్మెడని గెలిపిస్తే వేములవాడని తానే దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని కేటీఆర్ హామీ ఇస్తున్నారు. కేసీఆర్‌ని చూసి చల్మెడకు ఓట్లు వేసి గెలిపించాలని కేటీఆర్ అభ్యర్ధించడం గమనిస్తే ఆయనకు నియోజకవర్గంలో ప్రజలతో కానీ, పార్టీ కార్యకర్తలతో గానీ సంబందాలు బలంగా లేవని అర్దమవుతోంది.
దీనికి తోడు ఇంతకాలం ఆయనకు సహాయ నిరాకరణ చేస్తున్న రమేశ్ బాబు అనుచరులు, కేటీఆర్ ప్రచారసభ ముగియగానే పార్టీకి రాజీనామా చేశారు. వారిలో పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షుడు పుల్కంరాజు దంపతులు, ఇద్దరు కౌన్సిలర్లు కూడా ఉన్నారు.
ఈ పరిస్థితిలో తుల ఉమ బీజేపీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరుతుండటమే కాస్త ఉపశమనం కలిగించే విషయం. బీజేపీ అభ్యర్ధి వికాస్ రావుని ఓడించేందుకు ఆమె గట్టిగా కృషి చేస్తారు కనుక దాని వలన చల్మెడకు ఎంతో కొంత మేలు కలుగుతుంది.
అయితే వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఆది శ్రీనివాస్ 5వ సారి పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో వరుసగా నాలుగుసార్లు ఓడిపోయారు. కనుక పట్టణ ప్రజలు ఆయనపై సానుభూతి చూపవచ్చు. ఈసారి కాంగ్రెస్ గాలి కూడా వీస్తోంది. కనుక వేములవాడలో బిఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులకు ఎదురీత తప్పడం లేదు.