కర్ణాటకలోని జెడిఎస్ నాయకుడు కుమారస్వామి తెలంగాణలో హామీలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కర్ణాటక శాసనసభ ఎన్నికల సమయంలో 5 గ్యారెంటీ పధకాలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ వాటిలో ఒక్కటీ అమలుచేయలేకపోతోంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలలో కూడా 6 గ్యారెంటీ పధకాలను ప్రకటించి అమలుచేస్తామని ప్రజలను మోసగించాలని ప్రయత్నిస్తోంది.
కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇస్తున్న హామీలను అమలుచేస్తుందా? ప్రజలు ఆలోచించాలి. ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ నోటికి వచ్చిన్నట్లు హామీలు ఇస్తూ అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధుతో సహా అనేక పధకాలను విజయవంతంగా అమలుచేస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చుతోంది. కనుక తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
కేసీఆర్ టిఆర్ఎస్‌ను బిఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనుకొన్నప్పుడు కుమారస్వామిని చేరదీశారు. కర్ణాటక శాసనసభ ఎన్నికలలో జెడిఎస్ పార్టీతో కలిసి పోటీ చేసి ఆయనను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతామని హామీ ఇచ్చారు. కానీ కర్ణాటక ఎన్నికలప్పుడు కేసీఆర్ మొహం చాటేశారు. కుమారస్వామి ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ తమకు కనీసం ఆర్ధికసాయం అందిస్తారని చివరి నిమిషం వరకు ఎదురుచూశామని కానీ హ్యాండ్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
కర్ణాటకలో బీజేపీని ఓడించడానికి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బు మూటలు పంపించారని ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ఆరోపించారు. అంటే జెడిఎస్ ఓటమికి కూడా కేసీఆర్ పరోక్షంగా కారణమనుకోవచ్చు. కేసీఆర్ కుమారస్వామికి హ్యాండ్ ఇచ్చినా, కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరిన్నట్లే భావించవచ్చు.