డబ్బు మదంతోనే రాజగోపాల్ రెడ్డి పోటీ... ఓడించాల్సిందే: కేటీఆర్‌

November 12, 2023


img

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకురాలు పాల్వాయి స్రవంతి ఈరోజు బిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. బిఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, “పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరుకొన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి మా పార్టీలో ఉంటే బాగుంటుందని మేము ఆహ్వానించినా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. ఆయన కుమార్తె పాల్వాయి స్రవంతి ఇప్పుడు మా పార్టీలో చేరుతుండటం మాకు చాలా ఆనందం కలిగిస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసిన పాల్వాయి స్రవంతికి టికెట్‌ ఇవ్వకుండా పార్టీని మోసం చేసి మళ్ళీ తిరిగి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్‌ ఇవ్వడం చాలా దారుణం. ఆయన పార్టీలు ఎందుకు మారుతున్నారో అందరికీ తెలుసు. ఉపఎన్నికలలో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేతున్నారు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేసి ఎన్నికలలో గెలవగలననే గట్టి నమ్మకంతో ఉన్నారు. కనుక మునుగోడు ప్రజలు ఆయనకు మరోసారి గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకొంటున్నాను,” అని అన్నారు. 

పాల్వాయి స్రవంతి మీడియాతో మాట్లాడుతూ, “గౌరవం లేని చోట ఉండకూడదని నా తండ్రి ఎప్పుడూ చెపుతుండేవారు. మా కుటుంబం కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో సేవ చేసినా మమ్మల్ని కాదని పార్టీకి ద్రోహం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే టికెట్‌ ఇచ్చింది. నైతిక విలువలు లేని అటువంటి పార్టీలో ఉండలేకనే నేను కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిఆర్ఎస్‌ పార్టీలో చేరుతున్నాను,” అని అన్నారు.


Related Post