బిఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వం 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఆ కారణంగానే రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలు తరలివస్తున్నాయని సగర్వంగా చెప్పుకొంటున్నారు. అలాగే వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పుకొంటున్నారు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం కూడా చాలా ఎక్కువేనని అయినా తెలంగాణలో విద్యుత్ కొరత, కోతలు లేవని సాగరవంగా చెప్పుకొంటున్నారు.
ఇవ్వన్నీ వాస్తవాలే కనుక కాంగ్రెస్, బీజేపీలు ఖండించలేకపోతున్నాయి. పైగా కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలలో విద్యుత్ కొరత, కోతలు ఉన్నప్పుడు ఈ అంశంపై ఎన్నికల సమయంలో మాట్లాడటం రాజకీయంగా ఆత్మహత్యతో సమానమే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అదే తప్పు చేస్తోంది.
కరెంటు కొరతతో అల్లాడుతున్న కర్ణాటకను పాలిస్తున్న సిఎం సిద్దరామయ్యని, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించడం మరో పొరపాటు. వారి వలన ఎన్నికల ప్రచారంలో అప్రయత్నంగానే కర్ణాటకలో కరెంట్ కష్టాల గురించి చర్చ మొదలవుతోంది. దానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలు చెపుతున్న సమాధానాలు, సంజాయిషీలు ప్రజలలో మరింత అపనమ్మకం పెంచుతున్నాయే కానీ తగ్గించలేకపోతున్నాయి. కనుక బిఆర్ఎస్ పార్టీ ఇదే అంశాన్ని మీడియా ఇంటర్వ్యూలలో, ఎన్నికల ప్రచారంలో కూడా హైలైట్ చేస్తోంది.
మంత్రి కేటీఆర్ ఈరోజు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ప్రజలకు కరెంట్ కావాలో కాంగ్రెస్ కావాలో తేల్చుకోవాలి,” అని సూటిగా సింపుల్‌గా చెప్పేశారు. కాంగ్రెస్ కావాలనుకొంటే రాష్ట్రంలో మళ్ళీ కరెంట్ కష్టాలు, కోతలు మొదలవుతాయని, అదే 24 గంటలు కరెంట్ కావాలనుకొంటే బిఆర్ఎస్ పార్టీనే ఎన్నుకోవాలని కోరారు. మరి ప్రజలు ఏది కోరుకొంటారో డిసెంబర్ 3న ఫలితాలు వస్తే తెలుస్తుంది.