తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్స్ కార్యక్రమం కూడా ముగిసింది. ఈ నెల 30న పోలింగ్ జరుగబోతోంది. కనుక అన్ని పార్టీలు ఉదృతంగా ఎన్నికల ప్రచారం చేసుకొంటున్నాయి. ఇటువంటి కీలక సమయంలో ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో పలువురు సీనియర్ నేతలు పార్టీకి రాజీనామాలు చేసి సిఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు.
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కూటూరి మానవతా రాయ్, టీపీసీసి ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి కృష్ణ, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, పార్టీలో సీనియర్ రాజకీయనేతలు డా. రామచంద్రు నాయక్, వూకె అబ్బయ్య దంపతులు ఇంకా పలువురు నిన్న బిఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఎన్నికలకు ముందు అత్యంత కీలకమైన ఈ సమయంలో పార్టీ కోసం పనిచేసే ముఖ్యనేతలు లేకుండాపోయారు.
ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా తుమ్మల నాగేశ్వర రావు, బిఆర్ఎస్ అభ్యర్ధిగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సీపీఎం అభ్యర్ధిగా ఎర్ర శ్రీకాంత్, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా మిర్యాల రామకృష్ణ, ఇంకా పలువురు స్వతంత్ర అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు.