గజ్వేల్‌, కామారెడ్డిలో ఈసారి పోటీ రసవత్తరం

November 09, 2023


img

సిఎం కేసీఆర్‌ కొద్దిసేపటి క్రితమే గజ్వేల్‌లో ఆర్‌వో కార్యాలయంలో నామినేషన్ వేశారు. తర్వాత హెలికాఫ్టర్‌లో బయలుదేరి కామారెడ్డి చేరుకొని అక్కడ కూడా నామినేషన్ వేయబోతున్నారు. అనంతరం కామారెడ్డిలో జరిగే ప్రజా ఆశీర్వాదసభలో పాల్గొంటారు. 

ఈసారి గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తానని హుజూరాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ముందే ప్రకటించడంతో, ముందు జాగ్రత్త చర్యగా కేసీఆర్‌ కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారు. అయితే కామారెడ్డిలో కూడా ఆయనకు రేవంత్‌ రెడ్డి సవాలు విసురుతున్నారు. రేవంత్‌ రెడ్డి కొడంగల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయబోతున్నారు. ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌లో బిఆర్ఎస్ అభ్యర్ధిని ఓడించి తన సత్తా చాటుకోగా, రేవంత్‌ రెడ్డి ఫిరాయింపులతో బలహీనపడిన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాగలమనే నమ్మకం కలిగించారు. కనుక ఈటల రాజేందర్‌, రేవంత్‌ రెడ్డి ఇద్దరూ ఇద్దరే. ఇక కేసీఆర్‌ గురించి అందరికీ తెలిసిందే. కనుక ఈసారి ఈ రెండు నియోజకవర్గాలలో సమ ఉజ్జీల మద్య పోటీ చాలా రసవత్తరంగా ఉండబోతోంది. 


Related Post