తెలంగాణ కాంగ్రెస్‌ కొంప ముంచుతున్న కర్ణాటక కాంగ్రెస్‌

November 09, 2023


img

తెలంగాణ ఏర్పడిన పదేళ్ళ తర్వాత తొలిసారిగా ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పుంజుకొని బిఆర్ఎస్ పార్టీకి గట్టి సవాలు విసురుతోంది. ఈసారి కనీసం 60-70 స్థానాలు గెలుచుకొని అధికారంలోకి రాగలమని కాంగ్రెస్‌ గట్టిగా నమ్ముతోంది. 

ఇలాంటి పరిస్థితిలో కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవి కోసం మంత్రుల కీచులాటలు, ఎన్నికల సమయంలో ప్రకటించిన గ్యారెంటీ స్కీములు అమలుచేయలేక తిప్పలు పడుతుండటం, ముఖ్యంగా వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ అందించలేకపోవడం వంటివన్నీ తెలంగాణ కాంగ్రెస్‌ విజయావకాశాలను దెబ్బ తీసే ప్రమాదం కనిపిస్తోంది. 

కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలుచేయలేకపోతున్నప్పుడు తెలంగాణలో మాత్రం అమలుచేస్తారని గ్యారెంటీ ఏమిటని బిఆర్ఎస్ నేతలు, మీడియా కూడా నిలదీస్తుంటే పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా సమాధానం చెప్పలేక తడబడుతున్నారు. 

ఇండియా టుడే నిర్వహించిన రౌండ్ టేబిల్ సమావేశంలో ఇదే ప్రశ్న అడిగితే రేవంత్‌ రెడ్డి సమాధానం చెప్పలేక తడబడ్డారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీములను ఏవిదంగా అమలుచేస్తారని ప్రశ్నిస్తే రాచకొండ వద్ద 50 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించి మరో పెద్ద నగరాన్ని నిర్మిస్తామని, మూసీ నది వద్ద 24 గంటలు మూడు షిఫ్టులలో యువత కూరగాయాలు అమ్ముకొనేందుకు ఏర్పాటు చేస్తామని చెప్పడం గమనిస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఆరు గ్యారెంటీ స్కీములని ఏవిదంగా అమలుచేయాలనే దానిపై స్పష్టత లేదని అర్దమవుతుంది.


Related Post