తెలంగాణలో హంగ్? అయితే సమీకరణాలు ఎలా?

November 08, 2023


img

ఈసారి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్‌ పార్టీయే మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తుందని సర్వేలన్నీ సూచిస్తున్నాయి. అయితే తెలంగాణలో ఎవరి నోట విన్నా ‘ఈసారి కాంగ్రెస్‌ వస్తుంది’ అనే మాట వినిపిస్తోంది. అంటే తెలంగాణ ప్రజలు ఈసారి ప్రభుత్వాన్ని మార్చాలనుకొంటునట్లు భావించవచ్చు. కనుక కాంగ్రెస్ పార్టీకి కూడా ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాగల అవకాశాలు సరిసమానంగా ఉన్నాయని భావించవచ్చు. 

అయితే ఈసారి కాంగ్రెస్‌ పార్టీ గట్టి పోటీ ఇస్తుండటం, జనసేన, బీఎస్పీ బరిలో దిగుతుండటం, బీజేపీ కొత్తగా ‘బీసీ ముఖ్యమంత్రి’ నినాదం వంటివన్నీ పరిగణనలోకి తీసుకొన్నట్లయితే, వాటన్నిటి మద్య ఓట్లు చీలిక అనివార్యంగా కనిపిస్తోంది. 

ఒకవేళ అన్ని పార్టీల మద్య ఓట్లు చీలితే ఈసారి బిఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలలో దేనికీ పూర్తి మెజారిటీ రాకపోవచ్చు. ఒకవేళ హంగ్ ఏర్పడితే?ఏమవుతుంది? ఈ ప్రశ్నకు కాంగ్రెస్‌ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పిన మాటలు గుర్తు చేసుకోవలసి ఉంటుంది. 

“ఈసారి కాంగ్రెస్ పార్టీకి 59 కంటే ఒక్క సీటు తక్కువ వచ్చినా గెలిచిన ఎమ్మెల్యేలు బిఆర్ఎస్‌ పార్టీలోకి వెళ్ళిపోవడం ఖాయం,” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. అంటే హంగ్ ఏర్పడితే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఆకర్షించి బిఆర్ఎస్‌ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉందన్న మాట!

అయితే కేసీఆర్‌ నియంతృత్వం, కుటుంబ పెత్తనంతో విసుగెత్తిపోయున్న బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా గోడ దూకి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కూడా ఉంది. కనుక హంగ్ ఏర్పడినా కాంగ్రెస్‌కు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సమాన అవకాశం ఉందని భావించవచ్చు.   

హంగ్ ఏర్పడితే మజ్లీస్‌ మద్దతు బిఆర్ఎస్‌కు చాలా కీలకంగా మారుతుంది. అది బిఆర్ఎస్‌తోనే ముందుకు సాగుతోంది కనుక అది గెలుచుకోబోయే 9 సీట్లు బిఆర్ఎస్‌కు ఎంతగానో ఉపయోగపడవచ్చు. కానీ ప్రస్తుతం తెలంగాణలో ‘కాంగ్రెస్‌ వేవ్’ సాగుతోంది కనుక ఈసారి మజ్లీస్‌ కూడా కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపినా ఆశ్చర్యపోనక్కర లేదు.


Related Post