తెలంగాణలో ఈ ఏ,బీ,సీ టీమ్స్ ఏమిటో!

November 08, 2023


img

ప్రధాని నరేంద్రమోడీ నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ, బిఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు రెండూ నాణేనికి బొమ్మ బొరుసువంటివని, ఆ రెండు ఒక్కటేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్‌ ‘సీ టీమ్’ అని అన్నారు. బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్‌ అహంకారమే ఆ పార్టీ నేతలందరికీ వ్యాపించిందన్నారు. అహంకారంతో వ్యవహరిస్తున్న బిఆర్ఎస్ని గద్దె దించి బడుగు బలహీనవర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్న బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

దళితజాతికి చెందిన జిఎంసీ బాలయోగి, అబ్దుల్ కలాం, రాంనాధ్ కోవింద్, ద్రౌపది ముర్ము వంటివారికి సమున్నత పదవులు ఇచ్చి గౌరవించింది బీజేపీయే అని మోడీ గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటైతే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్‌ మోసం చేశారని, కానీ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని, ఇది మోడీ ఇస్తున్న మాట అని అన్నారు. 

తెలంగాణలో కత్తులు దూసుకొంటున్న బిఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు ఒకదానికొకటి ఏ టీమ్, బీ టీమ్, సీ టీమ్ అని వాదించుకొంటున్నాయి. అంటే మూడు పార్టీల మద్య ఎక్కడో ఏదో అవినాభావ సంబందం ఉందని ఒప్పుకొంటున్నాయన్న మాట! 

కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్‌ ‘సీ టీమ్’ అని మోడీ అన్నారు. బీజేపీకి బిఆర్ఎస్‌ ‘బీ టీమ్’ అని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. అంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బిఆర్ఎస్ పార్టీ బీ, సీ టీమ్‌గా వ్యవహరిస్తున్నట్లు అనుకోవాలేమో?

అయితే జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలు అధికారంలోకి రాకుండా పావులు కదుపుతుంటాయని బిఆర్ఎస్‌ వాదిస్తుంటుంది. అంటే కాంగ్రెస్‌, బీజేపీలు నాణేనికి బొమ్మ, బొరుసువంటివి అనుకోవలసి ఉంటుందన్న మాట!

ఈవిదంగా మూడు ప్రధాన పార్టీలు ఏ,బీ,సీ టీమ్ అంటూ ప్రజలను అయోమయపరిచి, దేనికవి ఎన్నికలలో విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నాయి. కనుక తెలంగాణ ప్రజలే విజ్ఞతతో ఆలోచించి సరైన పార్టీకి ఓట్లు వేసి గెలిపించుకోవలసి ఉంటుంది. 


Related Post