బీజేపీ గేమ్ చేంజర్‌: సిఎం అభ్యర్ధి ప్రకటన?

November 06, 2023


img

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు, బీజేపీని గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని నియమిస్తామని సంచలన ప్రకటన చేశారు. అయితే బండి సంజయ్‌ని మార్చడంతో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి తారుమారు అవడంతో ఎవరూ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ రేపు (మంగళవారం) ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

బీజేపీకి ముందుగా ముఖ్యమంత్రిని ప్రకటించే ఆనవాయితీ లేనప్పటికీ, తెలంగాణలో మళ్ళీ బీజేపీని పట్టాలు ఎక్కించేందుకు ముఖ్యమంత్రి అభ్యర్ధి పేరుని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో బీసీ నేతలు చాలా మందే ఉన్నారు. కానీ వారిలో బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

బండి సంజయ్‌: మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతగా గుర్తింపు పొందారు. అలాగే రాష్ట్రంలో అత్యంత శక్తివంతంగా మారిన బిఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ని ధైర్యంగా ఢీకొంటూ ఎన్నికలలో ఓడించి బీజేపీ అధికారంలోకి రాగలదనే నమ్మకం కలిగించగలిగారు.

బీజేపీ సిద్దాంతాలను మనసావాచా నమ్మి ఆచరించే వ్యక్తి. అటువంటి వ్యక్తిని అధ్యక్ష పదవి నుంచి తొలగించడం వలన పార్టీకి జరుగుతున్న నష్టాన్ని మోడీ, అమిత్ షా కళ్ళారా చూశారు కనుక బండి సంజయ్‌నే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తే మళ్ళీ సీన్ రివర్స్ అయ్యి బీజేపీ విజయావకాశాలు పెరుగుతాయని వారిరువురూ భావిస్తున్నట్లు సమాచారం. 

ఈటల రాజేందర్‌: ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈయన తెలంగాణ ఉద్యమాలలో చాలా చురుకుగా పాల్గొన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా చేసి తన సమర్ధతను కూడా నిరూపించుకొన్నారు. కనుక ఆయనకు కేసీఆర్‌, బిఆర్ఎస్ పార్టీ బలాలు, బలహీనతలు రెండూ బాగా తెలుసు. అలాగే రాష్ట్ర అవసరాలు, సమస్యలు, ప్రజల ఆకాంక్షలు అన్నీ బాగా తెలుసు. కనుక ఈటల రాజేందర్‌ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

ఒకవేళ ప్రధాని నరేంద్రమోడీ రేపు వీరిద్దరిలో ఎవరినైనా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించిన్నట్లయితే, అది తప్పకుండా ఈ ఎన్నికలలో గేమ్ చేంజర్‌ అవుతుంది.   

      



Related Post