వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎన్నికల బరిలో నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించి మూడు రోజులు కూడా కాలేదు. ఇంతలోనే ఆమె పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.
ఈరోజు ఉదయం ఆమె లోటస్ పాండ్ నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, “ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొంగ. ఈ మాట నేను అనడం లేదు. సుప్రీంకోర్టే చెప్పింది. టికెట్లు అమ్మికొన్న రేవంత్ రెడ్డిని ‘రేటేంత రెడ్డి’ అని కాంగ్రెస్ నేతలే అంటుయారు. అన్ని పార్టీలలో దొంగలు ఇలాంటి ఉంటారు కానీ దొంగలు ఎన్నటికీ ముఖ్యమంత్రులు కాలేరు,” అని వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ప్రయత్నించినప్పుడే రేవంత్ రెడ్డి వద్దని వారించారు. ఆమె ఏపీ కాంగ్రెస్‌లో చేరితే స్వాగతిస్తానని అన్నారు. కానీ ఆమె ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకొని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నించి మళ్ళీ భంగపడ్డారు.
అందువల్లే ఆమె ఎన్నికలలో పోటీ చేయలేకపోయారు. బహుశః ఆ ఉక్రోషంతోనే రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి ఈవిదంగా మాట్లాడారని భావించవచ్చు. కానీ తద్వారా ఎన్నికల తర్వాత కూడా తెలంగాణ కాంగ్రెస్‌లో చేరే అవకాశం లేకుండా చేసుకొన్నారు కదా?