ఈసారి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేయబోతున్నాయి. పొత్తులలో భాగంగా జనసేనకు బీజేపీ 11 సీట్లు కేటాయించింది. అయితే అవన్నీ కాంగ్రెస్, వామపక్షాల కంచుకోటలే కావడం విశేషం. పైగా బిఆర్ఎస్ పార్టీ కూడా ఆ స్థానాలలో చాలా బలంగా ఉంది. మరి ఏ ధైర్యంతో జనసేన ఆ సీట్లు అడిగి తీసుకొందో తెలీదు కానీ వాటిలో ఒక్క సీటు గెలుచుకొన్నా చాలా గొప్ప విషయమే అవుతుంది.
జనసేనకు కేటాయించిన సీట్లు: మల్కాజ్‌గిరీ, నాంపల్లి, కూకట్‌పల్లి, మెదక్, శేరిలింగంపల్లి, తాండూర్, కోదాడ, ఖమ్మం, అశ్వారావు పేట, కొత్తగూడెం, వైరా, నాగర్‌కర్నూల్.
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వామపక్షాలు చాల బలంగా ఉన్న సంగతి తెలిసిందే. మల్కాజ్‌గిరీ, నాంపల్లి, కూకట్‌పల్లి, మెదక్, శేరిలింగంపల్లిలో ఆంద్రా ఓటర్లు చాలా ఎక్కువమందే ఉన్నప్పటికీ వారు కాంగ్రెస్, బిఆర్ఎస్, జనసేనలను బేరీజు వేసుకొని కాంగ్రెస్ లేదా బిఆర్ఎస్ పార్టీలలో దేనికొ ఓ దానికి ఓట్లు వేసే అవకాశం ఉంది. కోదాడలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క తాండూర్‌లో మాత్రం పవన్ కళ్యాణ్ మొహం చూసి జనసేనకు ప్రజలు ఓట్లు వేస్తే వేయవచ్చు. ఈసారి ఎన్నికలలో బీజేపీ వెనుకబడిపోవడం, పోటీ ప్రధానంగా బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మద్యనే జరుగుతుండటం కూడా జనసేనకు నెగెటివ్ పాయింట్ అవుతుంది.