కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకొందని అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు అదే కర్ణాటకలో విద్యుత్ కోతలు, ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల కుమ్ములాటలు తెలంగాణ కాంగ్రెస్‌కు శాపంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఆరు నెలలు కాలేదు. కానీ అప్పుడే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక ఐటి శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే, హోంమంత్రి జి. పరమేశ్వర ఇద్దరూ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ కూడా ఏపీలాగ వెనకబడిపోతుందని, ప్రతీ ఆరు నెలలకీ ముఖ్యమంత్రి మారుతూనే ఉంటారని మంత్రి కేటీఆర్ ఇదివరకే చెప్పారు. ఇప్పుడు అదే జరిగేలా ఉంది. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కర్ణాటక మోడల్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కనుక ఇప్పుడు మంత్రులు, బిఆర్ఎస్ నేతలు, అభ్యర్ధులు కర్ణాటకలో జరుగుతున్న ఈ విషయాల గురించి గట్టిగా ప్రచారం చేస్తూ, మనకి ఇలాంటి నేతలు, పార్టీ, ప్రభుత్వం అవసరమా?అని ప్రశ్నిస్తున్నారు. కనుక కర్ణాటక కాంగ్రెస్‌లో జరుగుతున్న ఈ పరిణామాలే తెలంగాణ కాంగ్రెస్ ఓటమికి కారణం కావచ్చు.