ఈసారి శాసనసభ ఎన్నికలలో టిడిపి, తెలంగాణ జనసమితి, వైఎస్సార్ తెలంగాణ పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుండగా, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిక తగ్గి, ఆ ఓట్లన్నీ కాంగ్రెస్, బీజేపీలకు పడే అవకాశం ఉంటుంది.
ఈ దోస్తీలు, పొత్తులపై మంత్రి హరీష్ రావు స్పందిస్తూ, “అనాడూ తెలంగాణ ఏర్పడినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా రోజులు అన్నం తినలేదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుని జీర్ణించుకోలేకపోతున్న అటువంటి పవన్ కళ్యాణ్‌తో బీజేపీ చేతులు కలుపుతోంది.
తెలంగాణ ఏర్పాటు చేయకుండా పదేళ్ళు కాలక్షేపం చేసిన కాంగ్రెస్ పార్టీ అనేకమందిని బలిగొంది. తెలంగాణ ఏర్పాటు కాకుండా అడ్డుకొన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటుని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు. ఇలాంటి తెలంగాణ ద్రోహులందరూ కాంగ్రెస్, బీజేపీ ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని కబళించడానికి వస్తున్నారు. వారి మాయమాటలు నమ్మితే తెలంగాణ పరిస్థితి ఆంధ్రాలా తయారవుతుంది. కనుక తెలంగాణ అభివృద్ధి కోసం ప్రజలందరూ మళ్ళీ బిఆర్ఎస్ పార్టీకే ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నాను,” అని అన్నారు.
తెలంగాణ ఏర్పాటయ్యి, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నరేళ్ళయింది. కానీ ఎన్నికలు జరిగినప్పుడల్లా ఇలా తెలంగాణ సెంటిమెంట్ రాజేసి పైచేయి సాధించాలని ప్రయత్నిస్తుంటారు. ఇది బిఆర్ఎస్ పార్టీకి బలంగా కంటే బలహీనతగా మారిందని చెప్పక తప్పదు. కనుక ఈ సెంటిమెంటుని కాంగ్రెస్ బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.