తెలంగాణలో అన్ని పార్టీలు కాంగ్రెస్‌కే మద్దతు... దేనికి సంకేతం?

November 04, 2023


img

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఈసారి పోటీ బిఆర్ఎస్-బీజేపీలకు బదులు బిఆర్ఎస్‌-కాంగ్రెస్‌ పార్టీలకు మారడం విశేషం. కారణాలు అందరికీ తెలిసినవే. తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్‌ మళ్ళీ ఇంతగా పుంజుకోవడం చాలా ఆసక్తికరమే. 

ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలుస్తుందా లేదా? అనే విషయాన్ని పక్కన పెట్టి చూస్తే, రాష్ట్రంలో చిన్నా చితకాపార్టీలన్నీ దానికే మద్దతు పలుకుతుండటం విశేషం. తెలంగాణ జనసమితి, టిడిపి, వైఎస్సార్ తెలంగాణ పార్టీలు పోటీ నుంచి విరమించుకొని కాంగ్రెస్‌కు మద్దతు పలికాయి. 

మునుగోడు ఉపఎన్నికలలో బిఆర్ఎస్‌కు మద్దతు పలికిన వామపక్షాలు కూడా మళ్ళీ కాంగ్రెస్‌తోనే చేతులు కలిపేందుకు సిద్దపడ్డాయి. కానీ సీట్ల సర్దుబాట్లు కాకపోవడంతో వేరేగా పోటీ చేయక తప్పడం లేదు. అంటే ఇవన్నీ కేసీఆర్‌ని గద్దె దింపి కాంగ్రెస్‌ గెలవాలని కోరుకొంటున్నాయని అర్దమవుతోంది.

సాధారణంగా చిన్నచిన్న పార్టీలను అధికార పార్టీ పట్టించుకోదు. కేసీఆర్‌ కూడా పట్టించుకోలేదు. అయినా అన్ని పార్టీలు కాంగ్రెస్‌కే ఎందుకు మద్దతు పలుకుతున్నాయి?అంటే బలమైన కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. 

కేసీఆర్‌ వాటిని ఇబ్బంది పెట్టకపోయినా ఏనాడూ ప్రతిపక్షాలను గౌరవించకపోవడం, బిఆర్ఎస్‌ కారణంగా రాష్ట్రంలో మరో పార్టీ ఎదిగే అవకాశం లేకపోవడం, కేసీఆర్‌ ఎన్నికలను చాలా ఖరీదైన వ్యవహారంగా మార్చేయడంతో చిన్న పార్టీలేవీ ఎన్నికలలో పోటీ చేయలేని దుస్థితి, కేసీఆర్‌ ఏకపక్షంగా, నిరంకుశత్వంగా వ్యవహరిస్తుండటం, ఇంకా పార్టీల రాజకీయ అవసరాలు, లాభనష్టాల లెక్కలు వగైరాలు కారణాలుగా కనిపిస్తున్నాయి.   

చిన్న పార్టీలు పోటీ నుంచి తప్పుకొని  కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడంతో ఆ మేరకు ఓట్ల చీలిక తగ్గి, కాంగ్రెస్‌ ఖాతాలో పడే అవకాశం ఉంటుంది కనుక దాని విజయావకాశాలు పెరుగుతాయి. అయితే బిఆర్ఎస్‌ పార్టీ ఈ ప్రమాదాన్ని పసిగట్టి, ఈ కొత్త సమీకరణాలపై ‘తెలంగాణ ద్రోహులు’ ముద్రవేసి మళ్ళీ ఎప్పటిలాగే తెలంగాణ సెంటిమెంట్ రగిలించేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. 

కనుక ఈసారి బిఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మద్య గట్టిపోటీ ఉండబోతోంది. వీటిలో ఏది విజయం సాధించబోతోందో తెలియాలంటే డిసెంబర్‌ 3వరకు ఎదురుచూడాల్సిందే.


Related Post