పాపం షర్మిల! కాళ్ళు అరిగాయి కానీ...

November 03, 2023


img

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పోటీ చేయబోవడం లేదని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని దోచుకొంటున్న కేసీఆర్‌ని ఆయన ప్రభుత్వాన్ని గద్దె దింపడమే మా పార్టీ లక్ష్యం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనను ఓడించగలదని నమ్మకం కలిగింది. కనుక మేము పోటీ చేసి విజయావకాశాలున్న కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించాలనుకోవడం లేదు. అందుకే మా పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించాము. 

ఒకప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాతో కలిసి పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పాలేరు నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా నేను, మా పార్టీ నేతలు పాలేరులో ఎన్నికల ప్రచారం చేస్తాము. మా నిర్ణయం వలన ఇబ్బంది పడుతున్న పార్టీలోని నేతలకు, కార్యకర్తలను క్షమించమని అడుగుతున్నాను,” అని వైఎస్ షర్మిల అన్నారు. 

ఆంధ్రా మూలాలు ఉన్న వైఎస్ షర్మిల తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న తెలంగాణలో పార్టీ పెట్టుకోవడమే పెద్ద తప్పు. అన్ని పార్టీలు మొదటి నుంచే ఆమెను వారిస్తున్నా ఆమెకు మరో మార్గం లేకపోవడంతో తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకొన్నారు. అయితే అప్పుడు కూడా ఆమె తెలంగాణ సెంటిమెంట్ గమనించకుండా, తెలంగాణలో ‘రాజన్న రాజ్యం’ స్థాపిస్తానంటూ చెప్పుకొని తిరగడం మరో పెద్ద తప్పు. ఆమె తెలంగాణ సెంటిమెంట్ గౌరవిస్తూ ప్రయత్నించి ఉండి ఉంటే ప్రజలు ఆమెను ఆదరించేవారేమో?

తెలంగాణలో కేసీఆర్‌ని, బిఆర్ఎస్ పార్టీ ధాటికి జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలే తట్టుకోలేకపోతున్నాయని తెలిసి ఉన్నా వైఎస్ షర్మిల తెలంగాణలో అధికారంలోకి రాగలనని భ్రమలో ఉండటం మరో పెద్ద పొరపాటు.

రాజకీయంగా ఇన్ని తప్పటడుగులు వేసిన ఆమె, సరిగ్గా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసేందుకు సిద్దపడటం రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడమే. దీంతో ఇంతకాలం ఆమె వెంట తిరిగిన సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఆమె తమను మోసం చేసి తన దారి తాను చూసుకొనే ప్రయత్నించారని భావించి దూరం అయ్యారు. 

ఈ విషయం తెలిసీ కాంగ్రెస్‌లో విలీనం చేయలేక 119 స్థానాలకు పోటీ చేస్తామని వైఎస్ షర్మిల ప్రకటించడం మరో పెద్ద తప్పు. ఆమెకు ‘బైనాక్యులర్’ ఎన్నికల చిహ్నంగా లభించింది. దాంతో ఆమె అభ్యర్ధుల కోసం చూసినా ఎవరూ కనబడలేదు. కనుక గత్యంతరం లేని పరిస్థితులలో ఆమె ఎన్నికల నుచి తప్పుకొంటున్నట్లు ప్రకటించవలసి వచ్చింది. 

అయితే చింత చచ్చినా పులుపూ చావదన్నట్లు అభ్యర్ధులు దొరక్క పోటీ నుంచి తప్పుకొంటూ, కాంగ్రెస్‌ కోసం త్యాగం చేశామని కవరింగ్ ఇచ్చుకొన్నారు. దాదాపు నాలుగేళ్ళు ఎండనక, వానననక తెలంగాణలో 3,800 కిమీ కాళ్ళు అరిగిపోయేలా పాదయాత్ర చేసినా వైఎస్ షర్మిలకు ఎటువంటి ఫలితం దక్కలేదు. ఎందుకంటే ఉంగరం పోగొట్టుకొన్న చోటే వెతుక్కోవాలి కానీ వేరే చోట ఎంత వెతికినా ఏం ప్రయోజనం?పాపం వైఎస్ షర్మిల! 


Related Post