ఇంతకీ విజయశాంతి ఏమి చెప్పాలనుకొంటున్నారో?

November 02, 2023


img

బీజేపీ మహిళా నేత విజయశాంతి పార్టీలో తనకు సముచిత స్థానం, గౌరవం లభించడం లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లున్నారు. బీజేపీ శాసనసభ అభ్యర్ధుల మొదటి జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తి చెందిన్నట్లున్నారు. కనుక ఆమె బీజేపీని వీడి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో ఆమె తన మనసులో భావనలను ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకొన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ రెండు పార్టీలలో ప్రతీసారి తనకు ప్రతీసారి సంఘర్షణ మాత్రమే మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆనాడు తెలంగాణ కోసం, ఆ తర్వాత నుంచి కేసీఆర్‌ కుటుంబం దోపిడీ నుంచి రాష్ట్రానికి విముక్తి కోసమే తాను పోరాడుతున్నానన్నారు. తాను కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యుల అవినీతిని మాత్రమే వ్యతిరేకిస్తున్నాను తప్ప ఉద్యమ సమయంలో తనతో కలిసి పనిచేసిన బిఆర్ఎస్ కార్యకర్తలను కాదని విజయశాంతి ట్వీట్ చేశారు. సినిమాలలోగా రాజకీయాలలో ద్విపాత్రిభినయం చేయడం సాధ్యం కాదని అన్నారు. అంటే బీజేపీలో తనకు సముచిత స్థానం, గౌరవం లభించనప్పటికీ ఆ పార్టీలోనే కొనసాగక తప్పదన్నట్లు భావిస్తున్నట్లున్నారు. 

ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే.... 

25 సంవత్సరాల నా రాజకీయ ప్రయాణం , అప్పుడు ఇప్పుడు కూడా ఎందుకో సంఘర్షణ మాత్రమే నాకు ఇస్తూ వచ్చింది.... ఏ పదవి ఏనాడు కోరుకోకున్న... ఇప్పటికీ అనుకోకున్న కూడా... అయితే ప్రస్తుతం ఇది తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యం మన పోరాటం నాడు దశాబ్ధాల ముందు తెలంగాణ ఉద్యమ బాట నడిచినప్పుడు, మొత్తం అందరు తెలంగాణ బిడ్డల సంక్షేమం తప్ప, ఇయ్యాల్టి బీఆర్ఎస్ కు వ్యతిరేకం అవుతాం అని కాదు... నా పోరాటం నేడు కేసీఆర్ గారి కుటుంబ దోపిడి, కొందరు బీఆర్ఎస్ నేతల అరాచకత్వం పై తప్ప , నాతో కలిసి తెలంగాణా ఉద్యమంలో ప్రాణం అడ్డుపెట్టి పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదు... రాజకీయ పరంగా విభేదించినప్పటీకి, అన్ని పార్టీల మొత్తం తెలంగాణ బిడ్డలు సంతోషంగా, సగౌరవంగా ఎన్నటికే ఉండాలనీ మనఃపూర్వకముగా కోరుకోవటం మీ రాములమ్మ ఒకే ఒక్క ఉద్దేశ్యం... ఎప్పటికీ హర హర మహాదేవ్ జై తెలంగాణ.

 బీఆర్ఎస్ దుర్మార్గాల నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోనీకి కాంగ్రెస్ నుండి పోరాడాలి... 7 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జెండా మోసిన వ్యక్తి రాములమ్మ అని కొందరు.. బీజేపీని విధాన పూర్వకంగా 1998 నుండి విశ్వసించి దక్షిణ భారతంతో పాటు మిగతా అనేక రాష్ట్రాలలో దశాబ్ధ కాలం పైగా పనిచేసిన నేతగా, స్పష్టమైన హిందూత్వవాదిగా బీజేపీ వైపు నిలబడాలని మరెంతో మంది బిడ్డలు ఇంకోవైపు... రెండు అభిప్రాయాలు కూడా.... నిజానికి ఇయ్యాల తెలంగాణాల ఉన్న దుర్మార్గ కేసిఆర్ గారి పరిపాలన పరిస్థితుల నుండి కొట్లాడి మన ఉద్యమకారులం తెచ్చుకున్న రాష్ట్రానికి మేలు కొరకు మాత్రమే ఐనా.. సినిమా తీరుగా పోలీస్ లాకప్, రౌడీ దర్బార్, నాయుడమ్మ లెక్క ద్విపాత్రాభినయం చేసే అవకాశం రాజకీయాలలో సాధ్యపడదు. ఏదైనా ఒక పార్టీ కి మాత్రమే పని చేయగలుగుతం. హర హర మహాదేవ జై శ్రీరామ్ జై తెలంగాణ.


Related Post