తెలంగాణ జానా సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌తో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈరోజు భేటీ అయిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ముందు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని 3-4 స్థానాలలో పోటీ చేయాలని ప్రయత్నించారు కానీ ఈసారి కాంగ్రెస్‌కు విజయావకాశాలు ఉన్నందున పార్టీలోనే సీట్ల కోసం చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నానని కనుక ప్రస్తుత పరిస్థితులలో సీట్లు ఇవ్వలేమని రేవంత్ రెడ్డి నచ్చజెప్పారు.
ఎన్నికలలో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రొఫెసర్ కోదండరామ్‌కు, టీజేఎస్ పార్టీకి సముచిత స్థానం, గౌరవం ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో ప్రొఫెసర్ కోదండరామ్ కూడా సానుకూలంగా స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరామ్‌ని కేసీఆర్ పక్కన పెట్టిన తర్వాత ఆయన టీజేఎస్ పార్టీతో ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి గత ఎన్నికలలో పోటీ చేశారు కానీ ఓడిపోయారు. ఎన్నికలు చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోవడంతో ఆయన తెలంగాణ సాధన కోసం చేసిన పోరాటాలకు గుర్తింపు లేకుండా పోయింది. కనుక బలమైన కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకొన్నారు.