జనసేన, బీజేపీల పొత్తు కుదిరినట్లేనా?

October 30, 2023


img

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కొన్ని రోజుల క్రితం జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ని కలిసి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరినప్పుడు తమ పార్టీ 32 స్థానాల నుంచి పోటీ చేయాలనుకొంటోందని కనుక ఇప్పుడు వెనక్కు తగ్గలేమని సున్నితంగా చెప్పి పంపించేశారు.

ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా పవన్‌ కళ్యాణ్‌ని ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడారు. కానీ అప్పుడు కూడా పవన్‌ కళ్యాణ్‌ బీజేపీకి మద్దతు ఇస్తామని, కానీ పొత్తులు కుదిరాయని కానీ ప్రకటించలేదు. ఆ తర్వాత నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ పెళ్ళి కోసం భార్యతో కలిసి ఇటలీ వెళ్లారు. మళ్ళీ ఎప్పుడు తిరిగివస్తారో తెలీదు. కనుక బీజేపీకి మద్దతు లేదా ఆ పార్టీతో పొత్తులు లేన్నట్లే భావించవచ్చు. 

కానీ సోమవారం ఉదయం కూకట్‌పల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు జనసేనకు కూకట్‌పల్లి సీటు ఇస్తే సహించేది లేదంటూ నిరసనలు తెలియజేశారు. కూకట్‌పల్లి బీజేపీ అడ్డా, జనసేన మాకొద్దు అంటూ చాలాసేపు నినాదాలు చేశారు. అంటే బీజేపీ, జనసేనల మద్య పొత్తు, సీట్ల సర్దుబాటు జరిగిందని, దానిలో భాగంగా కూకట్‌పల్లి  సీటుని జనసేనకు ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరించిన్నట్లు స్పష్టమవుతోంది. కానీ బీజేపీ, జనసేన రెండు పార్టీలు పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. చేస్తే స్పష్టత వస్తుంది.


Related Post