వెన్నుపోటు పొడిచిన రాజగోపాల్ రెడ్డికే మునుగోడు టికెట్‌

October 28, 2023


img

కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం సాయంత్రం మరో 45 మంది అభ్యర్ధులతో రెండో జాబితాను చేసింది. ఊహించిన్నట్లే దానిలో మునుగోడు టికెట్‌ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చింది. ఇదివరకు ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి మునుగోడు ఉపఎన్నికలు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. 

అప్పుడు ఆయనను ఓడించేందుకు కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతిని నిలబెట్టి, ఆమె తరపున పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి గట్టిగా ప్రచారం చేశారు. కనుక మళ్ళీ ఆమెకే మునుగోడు టికెట్‌ ఇవ్వాలనుకొన్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆకస్మికంగా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావడం, ఢిల్లీ పెద్దలతో మాట్లాడుకొని మునుగోడు టికెట్‌ సంపాదించుకోవడంతో రేవంత్‌ రెడ్డి ఆమెకు న్యాయం చేయలేకపోయారు. 

కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచి, ఉపఎన్నికలలో పార్టీని ఓడించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే మళ్ళీ మునుగోడు టికెట్‌ ఇచ్చుకోవడం కాంగ్రెస్ పార్టీ నిసహాయతను, అలాగే ఈ ఎన్నికలలో తప్పకుండా గెలిచి తీరాలనే పట్టుదలను సూచిస్తున్నట్లు భావించవచ్చు. 

 నిన్న ప్రకటించిన రెండో జాబితాతో కలిపి కాంగ్రెస్‌ పార్టీ ఇంతవరకు మొత్తం 100 స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసిన్నట్లయింది. వారిలో కులాల వారీగా చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి 38 సీట్లు, ఎస్సీ, ఎస్టీలకు 31, బీసీలకు  20, వెలమలకు 9, కమ్మలు, బ్రాహ్మణులకు చెరో 3 సీట్లు, మైనార్టీలకు 4 సీట్లు కేటాయించింది. 


Related Post