బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి!

October 27, 2023


img

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు సూర్యపేటలో జరిగిన బీజేపీ జనగర్జన సభలో ప్రసంగిస్తూ, సంచలన ప్రకటన చేశారు. “ఈ శాసనసభ ఎన్నికలలో బీజేపీ గెలిస్తే తెలంగాణ ముఖ్యమంత్రిగా బీసీ వ్యక్తిని నియమిస్తాం,” అని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్‌ రెడ్డి లేదా మరో రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ముఖ్యమంత్రి అవుతారని ఇప్పటికే స్పష్టమైంది. అలాగే బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేసీఆర్‌ ఆ తర్వాత ఆయన కుమారుడు కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని అందరికీ తెలుసు. 

ఈ నేపధ్యంలో అమిత్ షా బీసీలకి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించడం ‘గేమ్ చేంజర్‌’ అనే చెప్పవచ్చు. ‘కాంగ్రెస్‌ లేదా బిఆర్ఎస్ పార్టీ బీసీలకు లేదా దళితులకు ముఖ్యమంత్రి ఇవ్వగలవా?’ అని అమిత్ షా సవాలు విసిరారు. 

తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువే ఉంది కనుక అమిత్ షా విసిరిన ఈ పాచిక పారితే తెలంగాణ శాసనసభ ఎన్నికలలో మళ్ళీ బీజేపీ ముందుకు దూసుకురాగలుగుతుంది. కానీ తెలంగాణ ప్రజలు ఈ ఒక్క దానికే బీజేపీ బుట్టలో పడతారా? అంటే అనుమానమే. 

అయితే అమిత్ షా చేసిన ఈ తాజా ప్రకటన కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలకు ఇబ్బందికరంగా మారవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో విహెచ్ హనుమంత రావు వంటి పలువురు బీసీ నేతలు, పార్టీలో రెడ్డి సామాజిక వర్గం పెత్తనం వదులుకొని బీసీలకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అటువంటి వారికి అమిత్ షా చేసిన ఈ తాజా ప్రకటన ఆయుధంగా అందివస్తుంది. కనుక కాంగ్రెస్‌ పార్టీపై ఒత్తిడి పెరగవచ్చు. 

బిఆర్ఎస్ పార్టీలో ఇటువంటి అవకాశం లేదు కానీ ఇకపై బీజేపీ నేతలు “మేము గెలిస్తే బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి సిద్దం మరి మీరు గెలిస్తే దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా?” అంటూ నిలదీస్తుంటే జవాబు చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ అదేమీ బిఆర్ఎస్ పార్టీకి పెద్ద సమస్య కాబోదు.


Related Post