రాజగోపాల్ రెడ్డిని నమ్మి కాంగ్రెస్‌ మరోసారి మోసపోనుందా?

October 26, 2023


img

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల గంట మ్రోగిన తర్వాత బీజేపీకి హ్యాండిచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దపడ్డారు. గత ఏడాది వరకు రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉండేదని, కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ బలపడిందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని భావిస్తున్నారు కనుక ప్రజాభీష్టం మేరకు తాను తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుకోవాలని నిర్ణయించిన్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తెలంగాణ కేసీఆర్‌ను ఓడించగల సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. 

కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దానిని నిందిస్తూ బీజేపీలో చేరడమే కాకుండా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడు ఉపఎన్నికలు కూడా తెచ్చిపెట్టారు. కానీ అప్పుడే ప్రజలు ఆయనను తిరస్కరించారు. ఒకవేళ ఆ ఎన్నికలలో గెలిచి ఉంటే, నేడు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి, ఆయన పరిస్థితి వేరేలా ఉండేవేమో?అప్పుడు ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బీజేపీలో చేరిపోయేవారేమో? 

కానీ ఆ ఉపఎన్నికలలో రాజగోపాల్ రెడ్డి ఓడిపోయారు. అప్పటి నుంచే ఆయన క్రమంగా బీజేపీకి దూరం కావడం మొదలుపెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకొని ఈసారి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తుండటంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుకొనేందుకు సిద్దపడుతున్నారు. ఆయన కూడా ఇదే మాట కాస్తా వేరేగా చెప్పారు కదా? 

ఒకవేళ ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఓడిపోయి ఆయన గెలిస్తే బిఆర్ఎస్ లేదా బీజేపీలోకి వెళ్లిపోకుండా ఉంటారా? ఒకవేళ కాంగ్రెస్‌ గెలిచి ఆయన ఓడిపోయి ఉంటే పదవుల కోసం గొడవ చేయకుండా ఉంటారా? అంటే అనుమానమే. రాజకీయ నాయకులందరూ అవకాశవాదులే అని అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి అవకాశవాది అవసరమా? ఆలోచించుకొంటే మంచిదేమో? 


Related Post