ఈసారి శాసనసభ ఎన్నికలలో సిఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. హుజూరాబాద్ ఉపఎన్నికలో కేసీఆర్‌కు కంగు తినిపించిన ఈటల రాజేందర్ ఈసారి గజ్వేల్ నుంచి పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం అయ్యుండవచ్చు. గజ్వేల్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ వలన బెడద ఏర్పడితే కామారెడ్డిలో కూడా కేసీఆర్‌కు బెడద తప్పేలా లేదు.
కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే తాను కొడంగల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేసేందుకు సిద్దమని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈరోజు ప్రకటించారు. ఒకవేళ తాను కాకపోతే భట్టి విక్రమార్క పోటీ చేస్తారని రేవంత్ రెడ్డి మీడియాకు తెలియజేశారు. కనుక కామారెడ్డిలో కూడా కేసీఆర్‌కు గట్టిపోటీ ఉండబోతోంది.
కామారెడ్డి నుంచి కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి లేదా భట్టిని పోటీలో దించాలని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే నిర్ణయించి ఉండవచ్చు. బహుశః అందుకే రేవంత్ రెడ్డి ఈవిదంగా అన్నారేమో? త్వరలోనే కాంగ్రెస్ పార్టీ మిగిలిన అభ్యర్ధులతో రెండవ జాబితా ప్రకటించనుంది. అది విడుదలైతే కేసీఆర్ మీద కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎవరు పోటీ చేయబోతున్నారో తెలుస్తుంది.