శాసనసభ ఎన్నికలకు బిఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగా 115 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. అయితే వారిలో నేటికీ 10 మంది అభ్యర్ధులకు కేసీఆర్ బీ ఫామ్స్ ఇవ్వలేదని సమాచారం. అంటే ఆ పది స్థానాలలో అభ్యర్ధులను మార్చే ఆలోచనలో ఉన్నారనుకోవచ్చు.
ఇటీవల గద్వాల్ జిల్లాలో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించడానికి వచ్చినప్పుడు, ఆలంపూర్ బిఆర్ఎస్ అభ్యర్ధి అబ్రహంను ప్రజలకు పరిచయం చేయకుండానే వెళ్ళిపోయారు. బహుశః అందుకు ఆయన చాలా షాక్ అయ్యి ఉండవచ్చు. ఆయన స్థానంలో మరొకరి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంకా నర్సాపూర్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి ఇస్తారనుకొంటే కేసీఆర్ దానిని పెండింగులో పెట్టడం, సునీతా లక్ష్మారెడ్డి పేరు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తుండటంతో ఆయన ఆందోళనలో ఉన్నారు. ఇంకా నాంపల్లి, ఘోషామహల్ అభ్యర్ధులను ఖరారు చేయలేదు. కనుక మిగిలిన అభ్యర్ధులు చేతికి బీ ఫామ్స్ వస్తే తప్ప ఎన్నికలలో పోటీ చేయబోతున్నామని ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు.