కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలలో టికెట్స్ ఆశించి భంగపడినవారు తమ పార్టీలకు రాజీనామాలు చేసి ప్రత్యర్ద పార్టీలలో చేరుతున్నారు.
సీనియర్ టిడిపి, కాంగ్రెస్ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణా రెడ్డి, నల్గొండకు చెందిన బీసీ నాయకుడు చెరుకు సుధాకర్ నేడు బిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు.
బిఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే 119 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించినందున కొత్తగా పార్టీలో చేరేవారికి టికెట్లు లభించే అవకాశం ఉండదు. కానీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద ఆగ్రహంతో బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు కనుక వారు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధులను దెబ్బ తీయడంలో బిఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడవచ్చు.
అయితే కాంగ్రెస్ పార్టీ 55 సీట్లకే అభ్యర్ధులను ప్రకటించింది కనుక బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరుతున్న నాయకులకి కాంగ్రెస్‌లో టికెట్స్ దక్కే అవకాశం ఉంది. కానీ బయట నుంచి వచ్చిన వారికి రేవంత్ రెడ్డి టికెట్స్ అమ్ముకొంటున్నారని పార్టీని వీడుతున్న నేతలు ఆరోపిస్తున్నందున వారందరికీ టికెట్స్ ఇవ్వలేకపోవచ్చు.
ఒకవేళ వారిలో కొంతమందికి కాంగ్రెస్ టికెట్స్ ఇచ్చినా, ఆ స్థానాల నుంచి పోటీ చేయాలనుకొంటున్న కాంగ్రెస్ నేతలు కూడా ఆగ్రహంతో పార్టీని వీడి బిఆర్ఎస్‌లో చేరిపోవచ్చు. అదే జరిగితే కాంగ్రెస్ విజయావకాశాలు తగ్గవచ్చు.
కనుక ఈ ఫిరాయింపుల వలన బిఆర్ఎస్ ఎంతో కొంత లాభపడే అవకాశాలు, కాంగ్రెస్ నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.