కాంగ్రెస్‌ వస్తే మళ్ళీ మొదటికే: కేసీఆర్‌

October 19, 2023


img

సిఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జడ్చర్ల, మేడ్చల్ ప్రజా ఆశీర్వాద సభలలో పాల్గొనప్పుడు, కాంగ్రెస్‌ పార్టీనే లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 20 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పి రోజుకి 5 గంటలే ఇస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ వస్తే 3 గంటలే కరెంట్ ఇస్తామని రేవంత్‌ రెడ్డి స్వయంగా చెప్పారు. కానీ దేశంలో వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. కాంగ్రెస్‌ వస్తే రాష్ట్రంలో మళ్ళీ కరెంట్ కష్టాలు మొదలవుతాయి. కాంగ్రెస్‌కు అధికారం కట్టబెడితే రైతు బంధు, దళిత బంధు, ధరణి పోర్టల్ అన్నీ తీసేస్తుంది. 

అసలు కాంగ్రెస్‌ వల్లనే తెలంగాణకు తీరని నష్టం కలిగింది. దానిని సరిచేసుకొనేందుకు 10 ఏళ్ళు పట్టింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకి గట్టిగా రెండు మూడురోజులకు సరిపడా నీళ్ళు అందించలేని జూరాలని కాంగ్రెస్‌ కేటాయించింది. కానీ రోజుకి 2 టీఎంసీలు నీళ్ళు అందించగల శ్రీశైలం ప్రాజెక్టుని కేటాయించి తదనుగుణంగా ప్రాజెక్టుని రీ-డిజైనింగ్ చేయించాను. 

తెలంగాణకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ, అనేకమందిని బలి తీసుకొన్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఏర్పాటు చేసి ప్రజలను ఉద్దరించామని గొప్పగా చెప్పుకొంటోంది. కానీ నేను చావు నోట్లో తలకాయ పెడితేకానీ తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణ ప్రజలందరూ కలిసికట్టుగా పోరాడి కాంగ్రెస్‌ మెడలు వంచి తెలంగాణను సాధించుకొన్నారని మరిచిన్నట్లుంది. 

కాంగ్రెస్‌ ఇస్తున్న హామీలను కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో అమలుచేయలేక చేతులెత్తేస్తూ, ఇక్కడ తెలంగాణలో అమలుచేస్తామని ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుంది,” అంటూ కేసీఆర్‌ నిప్పులు చెరిగారు.


Related Post