తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకొందని భావిస్తుంటే, రేవంత్ రెడ్డి పార్టీ టికెట్లు అమ్ముకొన్నారంటూ టీపీసీసీ కార్యదర్శి కురువ విజయ్ దేవరకొండ కుమార్, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు చేస్తున్న తీవ్ర ఆరోపణలు కాంగ్రెస్ విశ్వసనీయతను దెబ్బ తీస్తున్నాయి. ఎన్నికలలో కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకు బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలకు కొత్త ఆయుధాన్ని అందిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోకపోవడం రేవంత్ రెడ్డికి పెద్ద ఊరటనిస్తున్నాయి.
కనుక ఎవరేమంటున్నా పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ధైర్యంగా ముందుకే దూసుకుపోతున్నారు. ఈసారి ఎన్నికలలో డబ్బు మద్యం పంచకుండా నిజాయితీగా పోటీ చేస్తామని అమరవీరుల స్తూపం వద్ద ప్రతిజ్ఞ చేద్దాం రమ్మనమని రేవంత్ రెడ్డి కేసీఆర్‌కు సవాలు విసిరారు. అయితే నిన్న అదే సమయంలో కురువ విజయ్ దేవరకొండ కుమార్, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు కూడా ఛార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకొని, రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకోలేదని ప్రమాణం చేయడానికి రావాలని సవాలు విసిరారు. రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకొన్నారని వారు అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పారు. ఇందుకు తమ వద్ద సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని త్వరలో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి వాటిని అందిస్తామని చెప్పారు.
ఇప్పటికే ఈ ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరుగుతోంది. కనుక కాంగ్రెస్ పెద్దలు తక్షణం వారితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించుకోకపోతే మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పకపోవచ్చు.