కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలలో టికెట్స్ కోసం అభ్యర్ధులు కొట్టుకొంటుంటే, వైఎస్సార్ తెలంగాణ పార్టీకి అభ్యర్ధులే కరువయ్యారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేసి చేసి విసుగెత్తిపోయిన వైఎస్ షర్మిల 119 స్థానాలకు తమ పార్టీ పోటీ చేస్తుందని గొప్పగా ప్రకటించేశారు. కానీ అంతమంది అభ్యర్ధులే దొరకడం లేదు. టికెట్స్ ఇస్తాం దరఖాస్తు చేసుకోండని వైఎస్ షర్మిల చెప్పి నాలుగైదు రోజులైంది. కానీ ఇంతవరకు 62 మంది మందే దరఖాస్తు చేసుకొన్నారు.
వారిలో నలుగురు వైఎస్ షర్మిల (రెండు సీట్లు), ఆమె భర్త అనిల్, ఆమె తల్లి విజయమ్మ ఉన్నారు. పాలేరు నుంచి 8, సికింద్రాబాద్ నుంచి 12, మిగిలిన చోట్ల నుంచి మరో 42 మంది దరఖాస్తు చేసుకొన్నారు. కనుక వైఎస్సార్ టీపికి మరో 57 మంది అభ్యర్ధులు అవసరం ఉంది.
కాంగ్రెస్‌లో విలీనం ప్రస్తావన రాకముందు వైఎస్ షర్మిల పార్టీ పట్ల చాలా నమ్మకంగా ఉండేవారు. కనీసం 40 స్థానాలలో గెలుస్తామని చెపుతుండేవారు. కానీ కాంగ్రెస్‌లో విలీనం ప్రతిపాదనే కొంప ముంచిన్నట్లుంది. ఇంతకాలం ఆమెనే నమ్ముకొని వెంట తిరిగినవారికి హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్‌లో చేరిపోవడానికి ఆమె సిద్దపడటంతో పార్టీ క్యాడర్ షాక్ అయ్యి ఆమెకు దూరం అయ్యింది.
కానీ కాంగ్రెస్‌లో చేరలేక మళ్ళీ తిరిగి వచ్చి ఇప్పుడు టికెట్స్ ఇస్తామని ఆమె పిలుస్తున్నా ఎవరూ రావడం లేదు. ఈ దుస్థితికి కాంగ్రెస్ పార్టీ ఎంత కారణమో ఆమె కూడా అంతే కారణమని చెప్పక తప్పదు. పరువు పోతుందని 119 స్థానాలలో పోటీ చేయడం కంటే తమ కుటుంబ సభ్యులు పోటీ చేసే నాలుగు స్థానాలను గెలుచుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తే ఆమె సమస్యలు కొంతవరకు తీరే అవకాశం ఉంది.