నేను ముఖ్యమంత్రినవుతా: కె జానారెడ్డి

October 17, 2023


img

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేత కె. జానారెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నేనెప్పుడు పదవులని వెంట పరిగెత్తలేదు. పదవులే నన్ను వెతుక్కొంటూ వచ్చాయి. ఎవరూ ఊహించని విదంగా పీవీ నరసింహారావు ప్రధానమంత్రి కాలేదా? అలాగే నేను కూడా తెలంగాణ ముఖ్యమంత్రినవుతా. ఆరు నెలల్లో నా కొడుకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడు. అతని స్థానంలో నేను ఎమ్మెల్యేనవుతా,” అని అన్నారు. 

ఓ సీనియర్ కాంగ్రెస్‌ నేతగా ఆయన ముఖ్యమంత్రి పదవి ఆశించడం తప్పు కాదు. కానీ కాంగ్రెస్‌ కష్టకాలంలో ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు పార్టీకి దూరంగా ఉండిపోయి, రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకువస్తుంటే, జానారెడ్డి సడన్‌గా వచ్చి ముఖ్యమంత్రి పదవి నాకే అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన కుమారుడు ఇంకా నామినేషన్ వేయక ముందే 6 నెలల్లో తన పదవికి రాజీనామా చేసేస్తాడని జానారెడ్డి వంటి సీనియర్ రాజకీయ నాయకుడు చెప్పడం పార్టీకి ఎంత నష్టం కలిగిస్తుందో తెలుసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

ఇప్పటికే రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఇప్పుడు జానారెడ్డి తాను కూడా రేసులో ఉన్నానని చెపుతున్నారు. జానారెడ్డికి ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉన్న మాట అందరికీ తెలుసు. ఆయనకు ఆ కోరిక ఉన్నప్పుడు ఈ నాలుగేళ్ళుగా పార్టీ కోసం గట్టిగా పనిచేస్తూ ముందుండి నడిపించి ఉంటే అప్పుడు కాంగ్రెస్‌ అధిష్టానమే ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి ఉండేది కదా? కానీ కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికలలో గెలుస్తుందో లేదో ఇంకా తెలియదు. గెలిపించేందుకు ఆయన ఏమి చేస్తారో తెలీదు. కానీ గెలిస్తే మాత్రం నేనే ముఖ్యమంత్రినవుతా అంటున్నారు. మీకిది తగునా జానాగారు?


Related Post