ఈసారి శాసనసభ ఎన్నికలలో భద్రాచలం కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మద్య భీకరమైన పోరు జరుగబోతోంది. ఆ రెండు జిల్లాలపై మంచి పట్టు కలిగి, మంచి అంగబలం, అర్దబలం కలిగున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరడమే ఇందుకు కారణం.
పొంగులేటి, తుమ్మల ఇద్దరూ చేతులు కలిపారు కనుక ఈసారి ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు ఎదురీత తప్పదు. అసలు వారిద్దరినీ పువ్వాడ ఒంటరిగా ఢీకొని ఓడించగలరా?అనే సందేహం కలుగుతోంది. దీనికి తోడు రెండు జిల్లాలలో టికెట్స్ ఆశించి భంగపడిన బిఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.
ఈసారి ఎన్నికలలో వైఎసార్ తెలంగాణ, తెలుగు దేశం, బీఎస్పీలు కూడా పోటీ చేయబోతున్నాయి. ఈ మూడు పార్టీలు కూడా ప్రధానంగా ఈ రెండు జిల్లాలపైనే దృష్టి పెడుతున్నాయి. వైఎస్ షర్మిల పాలేరు నుంచి పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ కూడా బలమైన అభ్యర్ధులను బరిలో దించడం ఖాయమే కనుక ఈసారి ఈ రెండు జిల్లాలలో బిఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ తప్పదు.
ఒకవేళ ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ గెలిచి పువ్వాడ ఓడిపోతే, ఆయనని కూడా తుమ్మల, జూపల్లి, పొంగులేటి లాగే కేసీఆర్ పక్కన పెట్టేయడం ఖాయం. కనుక పువ్వాడకి ఈ ఎన్నికలలో గెలవడం తప్పనిసరి. మరి వీరందరిలో ఎవరు గెలుస్తారో?