కాంగ్రెస్‌, బిఆర్ఎస్ నేతల కప్పగంతులు

October 17, 2023


img

కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలలో టికెట్స్ ఆశించి భంగపడిన నేతలు ఆగ్రహంతో రెండు పార్టీల మద్య మారుతున్నారు. ఓ పక్క కాంగ్రెస్‌ నుంచి అనేకమంది రాజీనామాలు చేసి బిఆర్ఎస్‌లోకి వెళ్ళిపోతుంటే, బిఆర్ఎస్‌కి రాజీనామా చేసిన వస్తున్న నేతలను చూసి కాంగ్రెస్‌ నేతలు ఉప్పొంగి పోతున్నారు.

బోధ్ బిఆర్ఎస్‌ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావు ఈరోజు ఉదయం రేవంత్‌ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. జీహెచ్‌ఎంసీ బిఆర్ఎస్‌ ఫ్లోర్ లీడర్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ రెడ్డి ఆయన అనుచరులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

నల్గొండ మున్సిపల్ వైస్ ఛైర్మన్‌ అబ్బాగొని రమేష్, కౌన్సిలర్లు నవీన్ గౌడ్, ప్రదీప్ నాయక్, ఖయ్యూం బేగ్, ఆశీమా సుల్తానా, జెర్రిపోతుల అశ్విని ఈరోజు ఉదయం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 

నిజామాబాద్‌ టికెట్‌ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత బిఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారు.   

మరోవైపు జగదీశ్వర్ రావుని కాదని కొల్లాపూర్ టికెట్‌ జూపల్లి కృష్ణారావుకి ఇచ్చినందుకు నాగం జనార్ధన్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీశ్వర్ రావుని గెలిపించుకొంటామని, పారాచూట్ లీడర్ జూపల్లిని ఎన్నికలలో తప్పక ఓడిస్తామని నాగం హెచ్చరించారు. 

రేవంత్‌ రెడ్డి గద్వాల్ టికెట్‌ పది కోట్లకు అమ్ముకొన్నాడని తీవ్ర ఆరోపణలు చేసిన కురవ విజయ్‌ దేవరకొండ కుమార్‌ని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది.

కాంగ్రెస్‌, బీజేపీలు ఇప్పటికే చాలా మందికి టికెట్స్ ఖరారు చేసినందున కొత్తగా ఎవరు చేరినా వారికి టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఈ విషయం తెలిసీ అనేకమంది పార్టీలు మారుతున్నారు. వారి ఆగ్రహమే రెండు పార్టీలను కొంపముంచే ప్రమాదం ఉంటుంది. 


Related Post