తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సిఎం కేసీఆర్ 115 మంది బిఆర్ఎస్ అభ్యర్ధులను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మరో నలుగురికి కూడా టికెట్స్ ఖరారు చేశారు. అయితే నిన్న బిఆర్ఎస్ అభ్యర్ధులు అందరినీ తెలంగాణ భవన్‌కు ఆహ్వానించి వారిలో 51 మందికే బీ-ఫామ్స్ ఇచ్చారు. మళ్ళీ నిన్న రాత్రి మరో 9 మందికి బీ-ఫామ్స్ ఇచ్చారు. దీంతో మిగిలినవారిలో ఆందోళన మొదలైంది.
పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడకుండా ఉంచేందుకే కేసీఆర్ 115 మంది పేర్లు ప్రకటించారని, కానీ వారిలో సగం మందికే బీ-ఫామ్స్ ఇస్తారని, మిగిలినవారిని కేసీఆర్ మార్చేస్తారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోజే అన్నారు. ఆయన చెప్పిన్నట్లే సగం మందికే కేసీఆర్ బీ-ఫామ్స్ ఇవ్వడంతో మిగిలినవారిలో ఎవరెవరికి కేసీఆర్ పక్కన పెట్టేస్తారో అనే ఆందోళన మొదలైంది.
అయితే ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని జాబితాలో ప్రకటించిన వారందరికీ బీ-ఫామ్స్ ఇస్తామని కేటీఆర్ భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో కొందరు అభ్యర్ధులను మార్చవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక బీ-ఫామ్స్ చేతికి వచ్చే వరకు మిగిలిన వారందరికీ ఆందోళన తప్పదు.