తెలంగాణ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పధకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కర్నాటకలో కూడా కాంగ్రెస్ ఇలాంటి హామీలే ఇచ్చి అమలుచేయలేక చేతులెత్తేసిందని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో సంక్షేమ పధకాలను అమలుచేయలేనప్పుడు తెలంగాణలో ఏవిదంగా అమలుచేయగలదని బిఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు.
అయితే నిన్న కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పధకాలను కాపీ, పేస్ట్ చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాము ప్రకటించిన పధకాలనే కాస్త అటూ ఇటూ మార్చి సొంత పధకాలని చెప్పుకోవడం సిగ్గుచేటని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పధకాలు ఆచరణ సాధ్యం కావన్న కేసీఆర్ వాటినే కాపీ కొట్టి ప్రకటించడం ద్వారా తమ పధకాలన్నీ ఆచరణ సాధ్యమే అని కేసీఆర్ స్వయంగా ఒప్పుకొన్నట్లే కదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలనే అమలుచేయని కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ కొత్త హామీలతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఇన్ని హామీలు ఇచ్చినా కేసీఆర్ ఎన్నికలలో ఇంకా డబ్బు, మద్యం పంచిపెట్టేందుకు సిద్దపడుతున్నారంటే ఆయనకు బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే నమ్మకం లేదా? అని ప్రశ్నించారు. కనుక ఈసారి ఎన్నికలలో డబ్బు, మద్యం పంచబోమని అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేసేందుకు రావాలని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. రేపు (మంగళవారం) తాను వచ్చి ప్రమాణం చేస్తానని, దమ్ముంటే కేసీఆర్ కూడా వచ్చి ప్రమాణం చేయాలని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. రేవంత్ రెడ్డి సవాలుని కేసీఆర్ కాకపోయినా కేటీఆర్ స్వీకరించగలరా?