జనగామ బిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కాదని ఈసారి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు సిఎం కేసీఆర్. అందుకు అలిగిన ముత్తిరెడ్డిని టిఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టి శాంతింపజేశారు. దాంతో పల్లాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయనను గెలిపించేందుకు తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆశీర్వాదం తీసుకొని పల్లా జనగామలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారు. కానీ కాంగ్రెస్ పార్టీలో తుఫాను ఏర్పడితే ఆ ప్రభావం జనగామ బిఆర్ఎస్ పార్టీపై పడింది.
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. జనగామ టికెట్ ఇవ్వాలనే షరతుతో ఆయన బిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈసారి ఎలాగైనా జనగామ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకొన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్‌లను ఒప్పించి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని తప్పించి టికెట్ దక్కించుకొన్నారు. కానీ ఇప్పుడు పొన్నాల వస్తుండటంతో ఎంతో కష్టపడి సాధించుకొన్న జనగామ టికెట్ చేజారిపోబోతోంది. దీనిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఏవిదంగా స్పందిస్తారో?