చంద్రబాబు అరెస్ట్: బిఆర్ఎస్‌పై ప్రభావం చూపుతుందా?

October 14, 2023


img

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేయడం ఆ రాష్ట్రానికి సంబందించిన వ్యవహారమని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కానీ హైదరాబాద్‌, వరంగల్, ఖమ్మంతో సహా తెలంగాణలో పలు జిల్లాలలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లు లక్షల మంది ఉన్నారు. వారందరూ టిడిపి, చంద్రబాబు నాయుడి మద్దతుదారులని అనుకోలేము. 

కానీ హైదరాబాద్‌లో ఐ‌టి రంగాన్ని, విభజన తర్వాత ఏపీని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు నాయుడు చేసిన కృషిని ఎవరూ కాదనలేరు. కనుక హైదరాబాద్‌, తెలంగాణ జిల్లాలలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లు చంద్రబాబు నాయుడు పట్ల సానుభూతి ఏర్పడటం సహజం. కనుక వారికి ఆగ్రహం కలిగిస్తే బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ వ్యవహారంపై బిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్‌తో సహా అందరూ చాలా ఆచితూచి మాట్లాడుతున్నారనుకోవచ్చు. 

హైదరాబాద్‌లో ఐ‌టి, నాన్-ఐ‌టి ఉద్యోగులు, టిడిపి, చంద్రబాబు నాయుడు మద్దతుదారులు నల్ల దుస్తులు ధరించి ఈరోజు ఉదయం 10.30 గంటలకు మియాపూర్ స్టేషన్ నుంచి ఎల్బీ నగర్‌ వరకు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు అరెస్టుకి శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకు మేమందరం మెట్రోలో ప్రయాణించేందుకు ఇక్కడకు వచ్చాము. కానీ పోలీసులు మమ్మల్ని అడ్డుకొంటున్నారు. 

ఇప్పటికైనా కేసీఆర్‌ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించకపోగా పోలీసులతో మమ్మల్ని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు బిఆర్ఎస్‌ పార్టీ కూడా ఎన్నికలలో మూల్యం చెల్లించవలసివస్తుంది. హైదరాబాద్‌తో సహా తెలంగాణలో ఉన్న ఐ‌టి, నాన్-ఐ‌టి ఉద్యోగులు, చంద్రబాబు నాయుడు అభిమానులు అందరూ కూడా బయటకు వచ్చి ఆయనకు సంఘీభావం తెలపాలని కోరుతున్నాము,” అని అన్నారు.           

ఇది గమనిస్తే చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో బిఆర్ఎస్‌ ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నప్పటికీ, ఎన్నికలలో తప్పక ఈ ప్రభావం ఉంటుందని అర్దమవుతోంది.


Related Post