బండి సంజయ్ రాజకీయాలు చేసే తీరే చాలా వేరు. ఆయన మూడేళ్ళపాటు సిఎం కేసీఆర్ అంతటివాడిని ఆందోళనకు, తీవ్ర అభద్రతాభావానికి గురిచేస్తూ ఓ ఆట ఆడుకొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బిఆర్ఎస్ పార్టీ కూడా సందేహించే స్థాయికి తీసుకువెళ్ళారు. కానీ దురదృష్టవశాత్తు బీజేపీ అధిష్టానం ఆయనను పక్కన పెట్టేసి కూర్చోన్న కొమ్మను నరుకొంది. అది వేరే విషయం.
ఇంతకీ విషయం ఏమిటంటే, ఆయన ఈరోజు కరీంనగర్‌లో విలేఖరులతో మాట్లాడుతూ, మజ్లీస్ పార్టీకి దమ్ముంటే రాష్ట్రంలో 119 స్థానాలకు పోటీ చేయాలని సవాల్ విసిరారు. మజ్లీస్, బిఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఉందనే విషయం అందరికీ తెలుసని, అందుకే మజ్లీస్ పార్టీ హైదరాబాద్, పాతబస్తీకే పరిమితం అవుతోందన్నారు. తమ మద్య రహస్య అవగాహన ఏదీ లేదంటే మజ్లీస్ రాష్ట్రంలో అన్ని శాసనసభ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేయాలని బండి సంజయ్ సవాలు విసిరారు.
కేంద్ర ప్రభుత్వం సాయం చేయకుండానే రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరిగిపోతున్నాయా?అని బండి సంజయ్ ప్రశ్నించారు. నిధులు కేంద్ర ప్రభుత్వానివి గొప్పలు కేసీఆర్‌వి అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ బీజేపీ ధాటిని తట్టుకోలేకనే టిఆర్ఎస్ పెర్ను బిఆర్ఎస్ పార్టీగా మార్చుకొన్నారని అన్నారు.
రాష్ట్రానికి మోడీ, అమిత్ షాలు వస్తే పోలిటికల్ టూరిస్టులు వచ్చారంటూ ఎద్దేవా చేసే బిఆర్ఎస్ నేతలకు తమ అధినేత కేసీఆర్ మీ అందరినీ వెంటబెట్టుకొని ప్రత్యేక విమానాలలో రాష్ట్రాలు తిరుగుతున్నప్పుడు పోలిటికల్ టూరిస్టులమని అనిపించలేదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. నిజమే కదా?