ఒకరి తిక్క ప్రపంచానికే ప్రమాదకరం?

October 11, 2023


img

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు తిక్క రేగితే దానికి ఉక్రెయిన్ దేశం, ప్రజలు తమ ధనమానప్రాణాలను మూల్యంగా చెల్లిస్తున్నారు. ఎల్లప్పుడూ తిక్కగా వ్యవహరించే ఉత్తర కొరియా అధ్యక్షుడు వలన దశాబ్ధాలుగా ఆ దేశంలో ప్రజలు నానా కష్టాలు అనుభవిస్తున్నారు. వారితో పాటు పక్కనే ఉన్న దక్షిణ కొరియా, సుదూరంగా ఉన్న అమెరికా వంటి అగ్రదేశాలు కూడా ఉలికులికి పడుతుంటాయి. 

చైనా అధ్యక్షుడుకి తిక్క రేగితే తైవాన్, నేపాల్, భారత్‌, జపాన్ దేశాలు ఆందోళన చెండాల్సింది. పాకిస్తాన్‌ పండగ చేసుకోవాలనుకొంటే కాశ్మీరులో బాంబులు మోత మోగాల్సిందే. అమాయక ప్రజలు, సైనికులు బలి కాలావాల్సిందే. 

తాజాగా పాలస్తీనాలో మిలిటెంట్ సంస్థ హమాస్ దుందుడుకుతనానికి ఇజ్రాయెల్, పాలస్తీనా రెండు దేశాలలో ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు. 

ఒకప్పుడు ప్రజలతో కళకళలాడిన ఉక్రెయిన్ దేశం దాదాపు రెండేళ్లుగా రష్యా అధ్యక్షుడు పుతీన్ యుద్ధోన్మాదానికి బలవుతుండటంతో అతిపెద్ద శిధిలా సామ్రాజ్యంలా మారిపోయింది. అయినా పుతిన్ యుద్ధ కాంక్ష ఇంకా తీరలేదు. అందుకే ఇజ్రాయెల్-పాలస్తీనల మద్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా వేలుపెడితే, రష్యా పాలస్తీనాకు అండగా నిలుస్తుందంటూ హెచ్చరించారు. 

రష్యా దళాలు ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తూ విరుచుకుపడుతున్నప్పుడు కూడా అమెరికా, నాటో దేశాలు కలుగజేసుకొంటే, అణుయుద్ధానికి సిద్దమంటూ పుతిన్ హెచ్చరించారు. మళ్ళీ ఇప్పుడు అదే చెపుతున్నారనుకోవచ్చు. 

ఇజ్రాయెల్-పాలస్తీనాల మద్య మొదలైన ఈ యుద్ధం ప్రపంచదేశాలను రెండుగా చీల్చుతోంది కూడా. అన్ని దేశాలు ఏ గట్టున ఉండాలో తేల్చుకోక తప్పడం లేదు. 

అమెరికా, యూరోపియన్ దేశాలు, భారత్‌ ఇజ్రాయిల్ వైపు మొగ్గు చూపుతుండగా, చైనా, రష్యా, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా తదితర గల్ఫ్ దేశాలు పాలస్తీనావైపు మొగ్గు చూపుతున్నాయి. ఇవి కూడా చెరోవైపు చేరి యుద్ధంలో పాల్గొన్నట్లయితే ఇది మూడో ప్రపంచయుద్ధానికి దారి తీస్తుందని ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. 

అయితే అత్యంత శక్తివంతమైన ఇజ్రాయెల్ దేశానికి మరో దేశం నైతిక, దౌత్యపరమైన మద్దతు తప్ప సాయుధపరమైన మద్దతు అవసరమే లేదు. కనుక త్వరలోనే పాలస్తీనాతో యుద్ధం ముగించవచ్చు లేదా ఉక్రెయిన్‌పై రష్యాలాగే సుదీర్గంగా ఈ యుద్ధం కొనసాగించవచ్చు. అయితే భారత్‌ ఇజ్రాయిల్‌కు మద్దతు తెలుపుతున్నందున గల్ఫ్ దేశాలు భారత్‌కు మరింత దూరం కావచ్చు. కానీ అదే సమయంలో అమెరికా, యూరోపియన్ దేశాలటో భారత్‌ బంధం మరింత బలపడవచ్చు.


Related Post