గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నిర్వహించాల్సిన ఉద్యోగాలను వాయిదా వేస్తున్నట్లు టిఎస్‌పీఎస్సీ ప్రకటించింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నవంబర్ 2,3 తేదీలలో జరగాల్సిన ఈ పరీక్షలను 2024 జనవరి 6,7 తేదీలకు వాయిదా వేస్తున్నట్లు టిఎస్‌పీఎస్సీ ప్రకటించింది. నవంబర్ 3వ తేదీన పరీక్ష జరగవలసిన రోజే శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతున్నందున, ఈ పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బందిలో చాలా మంది ఎన్నికల విధులలో బిజీ అయిపోతారు కనుక తప్పనిసరి పరిస్థితులలో గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు టిఎస్‌పీఎస్సీ ప్రకటన ద్వారా తెలియజేసింది.
గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి టిఎస్‌పీఎస్సీ 2022లో డిసెంబర్ 29వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ద్వారా 783 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్దమైంది. ఈ ఉద్యోగాలకు 5,51,943 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకొని, వచ్చే నెల జరుగబోయే ఈ పరీక్షలకు సిద్దం అవుతున్నారు.
ఇప్పుడు పరీక్షలు వాయిదా పడటంతో వారందరి శ్రమ వృధా అయిపోయింది. మరో మూడు నెలలు పరీక్షల కోసం ఎదురుచూడాలి. ఒకవేళ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బిఆర్ఎస్‌కు బదులు వేరే ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ విషయంలో అది పునరాలోచించినా ఆశ్చర్యం లేదు.
ఒకవేళ మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే పరీక్షలు యధాతధంగా జరిగే అవకాశం ఉంటుంది. అంటే వీటి కోసం దరఖాస్తు చేసుకొన్న నిరుద్యోగ యువత, వారి కుటుంబ సభ్యులు అందరూ బిఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేసి గెలిపించాలన్న మాట! బహుశః ఇవన్నీ ముందుగానే ఆలోచించే ఈ గ్రూప్-2 పరీక్షల నిర్వహించేందుకు బిఆర్ఎస్ ప్రభుత్వం తొందరపడలేదేమో?అనే సందేహం కలుగుతోంది.