తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీ గెలిచి అధికారంలోకి రాబోతోంది. ఈసారి ఎన్నికలలో ఓ నిశబ్ధ విప్లవం రాబోతోంది. అది బీజేపీని గెలిపించబోతోంది. కనుక బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు మూడు స్థానాల కోసం పోటీ పడకతప్పదు. ఈసారి ఎన్నికలలో బీజేపీని గెలిపించుకొనేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు. మేమందరం కూడా రాబోయే 30-40 రోజులు కష్టపడి పనిచేస్తూ బీజేపీని గెలిపించుకొంటాము,” అని అన్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఆ పదవిలో నుంచి తప్పించడంతోనే బీజేపీ-బిఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఉందనే ఓ తప్పుడు సంకేతం ప్రజలకు వెళ్ళింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత అరెస్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గడం వలన కూడా ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళాయి. ఇవి బీజేపీకి తీరని నష్టం కలిగించాయి.
అప్పటి నుంచే బిఆర్ఎస్ పార్టీతో తమకు ఎటువంటి రహస్య అవగాహన లేదని బీజేపీ నేతలు ప్రతీ సభలో ప్రజలకు వివరణ ఇచ్చుకోవలసి వస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ నిజామాబాద్‌లో పర్యటించినప్పుడు చెప్పిన విషయాలు కూడా అందుకే. కనుక బీజేపీ విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారినప్పుడు, అది ఏవిదంగా ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాగలదో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డే చెప్పాలి.