మునుగోడు ఉపఎన్నికలలో సీపీఐ, సీపీఎంలు కేసీఆర్ మాటలు నమ్మి బిఆర్ఎస్ పార్టీతో పొత్తులు పెట్టుకొన్నాయి. ఉపఎన్నికలలో బిఆర్ఎస్ విజయం సాధించడానికి అవి ఎంతగానో తోడ్పడ్డాయి. కానీ శాసనసభ ఎన్నికలలో వామపక్షాల అవసరం లేదని కేసీఆర్ భావించిన్నట్లున్నారు. అందుకే వాటిని సంప్రదించకుండానే 115 మంది అభ్యర్ధుల జాబితాను ప్రకటించేసి వాటికి షాక్ ఇచ్చారు. కేసీఆర్ తమను మోసం చేశారంటూ వామపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ హ్యాండ్ ఇవ్వడంతో ఈసారి వామపక్షాలు కాంగ్రెస్ హస్తం అందుకొన్నాయి. జాతీయస్థాయిలో ఇండియా కూటమిలో కాంగ్రెస్‌తో దోస్తీ కుదిరినందున రాష్ట్ర స్థాయిలో కూడా మళ్ళీ కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకొన్నాయి. పొత్తులలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వాటికి నాలుగు సీట్లు కేటాయించింది.
సీపీఐ పార్టీకి కొత్తగూడెం, మునుగోడు స్థానాలు కేటాయించగా, సీపీఎంకి భద్రాచలం, మిర్యాలగూడ స్థానాలు కేటాయించింది. మునుగోడు నుంచి సీపీఐ పోటీ చేయబోతోంది కనుక ఉపఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించమని ఎన్నికల ప్రచారం చేసిన సీపీఐ పార్టీయే, ఈసారి ఆయనను ఓడించమని మునుగోడు ప్రజలను అభ్యర్ధించబోతుండటం విశేషం.