ప్రముఖ తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు రాజకీయాలపై ఉన్న ఆసక్తి, ఎన్నికలలో పోటీ చేసి శాసనసభలో అడుగుపెట్టాలనే తపిస్తున్నారని అందరికీ తెలిసిందే. గత ఎన్నికలలోనే కాంగ్రెస్ టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేశారు కానీ నిరాశే మిగిలింది. ఆ తర్వాత ‘ఈ రాజకీయాలు నాకొద్దు’ అంటూ కొంతకాలం దూరంగా ఉన్నారు. కానీ మళ్ళీ ఎన్నికలొచ్చేసరికి మళ్ళీ కాంగ్రెస్ టికెట్ కోసం తెర వెనుక గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈసారి కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆయనకు టికెట్ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అవడంతో ఆయనను కూకట్‌పల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్లు తాజా సమాచారం.
కూకట్‌పల్లి పరిసర ప్రాంతాలలో ఆంధ్రా నుంచి వచ్చి స్థిరపడినవారు చాలా మంది ఉన్నారు కనుక ఆంధ్రా మూలాలున్న బండ్ల గణేశ్‌ని బరిలో దింపితే విజయం సాధించవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఆర్ధికంగా బలంగా ఉన్న ఆయన కూడా ఎన్నికలలో పోటీ చేసి గెలవాలని తహతహలాడుతున్నందున ఆయనకు టికెట్ ఇస్తే గెలిచేందుకు గట్టిగా ప్రయత్నిస్తారని వేరే చెప్పక్కర లేదు.
త్వరలో కాంగ్రెస్ జాబితా విడుదల కాబోతోంది. అది బయటకు వస్తే ఆయనకు ఈసారి కాంగ్రెస్ టికెట్ లభిస్తుందో లేదో తెలుస్తుంది.