కేటీఆర్‌ని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మీ పర్మిషన్ ఎందుకు?

October 05, 2023


img

ప్రధాని నరేంద్రమోడీ నిజామాబాద్‌లో తెలంగాణ సిఎం కేసీఆర్‌ గురించి చెప్పిన విషయాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ, “మేము కేటీఆర్‌ని ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే అందుకు ప్రధాని మోడీ అనుమతి తీసుకోవలసిన అవసరం మాకేమిటి? మా దగ్గర ఎమ్మెల్యేలున్నారు. కావాలంటే మేము చర్చించుకొని నిర్ణయం తీసుకోగలము. ఇంత చిన్న విషయం తెలియకుండా ప్రధాని నరేంద్రమోడీ అర్దంలేని మాటలు మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

గ్రేటర్ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ వచ్చి తనను కలిశారని, ఎన్డీఏలో చేరుతానంటే నిరాకరించానని ప్రధాని నరేంద్రమోడీ చెప్పుకొన్నారు. అప్పుడే వెంటనే చెప్పి ఉండొచ్చు కదా? ఇంతకాలం ఈ విషయం ఎందుకు చెప్పలేదు?

తెలంగాణలో ఎన్నికలొస్తున్నాయి కనుక రాష్ట్రానికి వచ్చి ఏదో ఒకటి మాట్లాడి ప్రజలను గందరగోళపరిచి బీజేపీని గెలిపించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లున్నారు. కానీ ఈసారి ఎన్నికలలో కూడా బీజేపీకి పరాభవం తప్పదు. మళ్ళీ బిఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది. కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారు,” అని అన్నారు. 

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వాదన సహేతుకంగానే ఉందని అర్దమవుతోంది. 

అయితే బిఆర్ఎస్ పార్టీని ఓడించి తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. కనుక సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీని కలిసి తన కొడుకు కేటీఆర్‌ని ముఖ్యమంత్రిగా చేయాలనుకొంటున్నానని చెప్పి అందుకు సహకరించమని కోరి ఉండవచ్చు. 

అందుకు ప్రతిగా తాము ఎన్డీఏలో చేరి కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడుతామని చెప్పి ఉండవచ్చు. కనుక ప్రధాని మోడీ బయటపెట్టిన ఈ విషయాన్ని అబద్దమని కొట్టిపడేయలేము. 

అయితే ఈ విషయం మూడేళ్ళపాటు ఎందుకు బయటపెట్టలేదు? ఇప్పుడే ఎందుకు బయటపెట్టారు?అంటే బిఆర్ఎస్ పార్టీతో తమకు ఎటువంటి రహస్య అవగాహన లేదని, దానిని బీజేపీ రాజకీయ శత్రువుగానే భావిస్తోందని ప్రజలకు చెప్పేందుకే కావచ్చు. కానీ ఈ మాటలు, ఈ యుద్ధాలు బీజేపీ, బిఆర్ఎస్‌ల రహస్య బంధం గురించి ప్రజలలో ఏర్పడిన అనుమానాలను, అపోహలను తొలగించలేవు. 


Related Post