తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి నిజామాబాద్ జిల్లాలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు, రాష్ట్ర ప్రభుత్వం కోరుతూనే ఉంది. దీని కోసం మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చాలా కృషి చేశారు కానీ కేంద్రం అంగీకరించలేదు.
ఆ తర్వాత పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తాననే హామీతో ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కానీ ఆయన ఏర్పాటు చేయించలేకపోయారు. అయితే మళ్ళీ లోక్‌సభ ఎన్నికలలో ఆయన గెలవాలన్నా, తెలంగాణలో బీజేపీ విజయావకాశాలు పెరగాలన్నా పసుపు బోర్డు ఏర్పాటు అనివార్యమని బీజేపీ అధిష్టానం బాగానే గుర్తించిన్నట్లుంది.
అందుకే తొమ్మిదేళ్ళలో సాధ్యం కానీ పసుపు బోర్డుకి మూడే మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రధాని నరేంద్రమోడీ నిజామాబాద్‌లో పర్యటించినప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం, వెంటనే కేంద్ర క్యాబినెట్ దానిని ఆమోదించడం చకచకా జరిగిపోయాయి.
ఇదివరకు పసుపు బోర్డు వలన ఉపయోగం ఉండదని చెప్పిన కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు దాని వలన ఎగుమతులు పెరుగుతాయని, పసుపు నూతన ఉత్పత్తుల పరిశోధనకు అవకాశం లభిస్తుందని చెప్పడం విశేషం. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఈ లోక్‌సభ ఎన్నికల వరకు అమలుచేయడానికి కేంద్ర ప్రభుత్వం తటపాటాయించింది. కానీ ఎట్టకేలకు తెలంగాణ పసుపు రైతుల కోసం కాకపోయినా ఎన్నికల కోసమైనా అంగీకరించింది. అదే సంతోషం.