బిఆర్ఎస్ ఎవరితో చేతులు కలపలేదా.... హవ్వ!

October 04, 2023


img

కేసీఆర్‌ ఎన్డీఏలో చేరాలనుకొన్నారంటూ ప్రధాని మోడీ చేసిన విమర్శలను ఖండిస్తూ మంత్రి కేటీఆర్‌ ‘తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి నేటి మేము ఎవరితో కలవలేదు,’ అని ఘాటుగా ట్వీట్ చేశారు. అయితే మజ్లీస్‌తో తమకు బలమైన అనుబందం ఉందనే సంగతి కేటీఆర్‌ మరిచిన్నట్లున్నారు. మునుగోడు ఉప ఎన్నికలలో వామపక్షాలతో పొత్తు పెట్టుకొని తమ అభ్యర్ధిని గెలిపించుకొన్న సంగతి మరిచిన్నట్లున్నారు.

అంతకు ముందు కేసీఆర్‌ పార్టీ నేతలను వెంటబెట్టుకొని ప్రత్యేక విమానం వేసుకొని పలు రాష్ట్రాలకు వెళ్ళి ఫ్రంట్ ఏర్పాటు కోసం పలువురు నేతలతో దోస్తీకి ప్రయత్నించిన సంగతి కేటీఆర్‌ మరిచిన్నట్లున్నారు. కర్ణాటక శాసనసభ ఎన్నికలలో జెడిఎస్ పార్టీతో కలిసి పోటీ చేస్తామని చెప్పి కుమారస్వామిని తన చుట్టూ తిప్పుకొన్నామని కేటీఆర్‌ మరిచిన్నట్లున్నారు. 

ఇప్పుడు ఎవరితో కలవలేక కేసీఆర్‌ ఒంటరిగా సాగుతున్నప్పటికీ, బీజేపీతో రహస్య అవగాహన ఉందని కాంగ్రెస్‌ వాదిస్తున్న సంగతి తెలిసిందే. 

బీజేపీతో కాదు... కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్‌కు రహస్య అవగాహన ఉందని నిన్న ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించడం అందరూ వినే ఉంటారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కేసీఆర్‌ తెలంగాణ నుంచి డబ్బు మూటలు పంపించారని కూడా ప్రధాని నరేంద్రమోడీ నిన్న ఆరోపించారు. 

బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఒంటరిగా ఉన్నప్పటికీ లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి వస్తే దానిలో చేరే అవకాశం ఉంది. అందుకోసమే మరికొన్ని ఎంపీ సీట్లు గెలుచుకొని తన బలం పెంచుకొనేందుకు కేసీఆర్‌ మహారాష్ట్రాలో తిరుగుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. కనుక బిఆర్ఎస్ ఎవరితో చేతులు కలపలేదనడం సరికాదు. 


Related Post