కేసీఆర్‌ ఎన్డీఏలో చేరాలనుకొన్నారు: మోడీ

October 04, 2023


img

 ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం నిజామాబాద్‌లో పర్యటించినప్పుడు సిఎం కేసీఆర్‌ గురించి ఓ సంచలన విషయం బయటపెట్టారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో కేసీఆర్‌ వెంటనే ఢిల్లీకి వచ్చి తనతో బేరసారాలు చేశారని మోడీ చెప్పారు. 

ఆయన ఢిల్లీ వచ్చి తనను కలిసినప్పుడు మీ నేతృత్వంలో భారత్‌ అభివృద్ధిచెందుతోందని కనుక బిఆర్ఎస్ పార్టీ కూడా ఎన్డీఏ కూటమిలో చేరేందుకు సిద్దంగా ఉందని చెప్పారు. అందుకు ప్రతిగా జీహెచ్‌ఎంసీలో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆ రెండు ప్రతిపాదనలను మేము నిర్ద్వందంగా తిరస్కరించాము. 

కేసీఆర్‌ తన కొడుకు కేటీఆర్‌ని ముఖ్యమంత్రి చేయాలనుకొంటున్నానని, అతనిని మేము ఆశీర్వదించాలని కోరారని ప్రధాని మోడీ చెప్పారు. అయితే ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వారే అధికారంలోకి వస్తారని నేను చెప్పాను. అప్పటి నుంచే కేసీఆర్‌ మాపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. 

ఆయన కుటుంబ అవినీతి గురించి మొహం మీదే చెప్పడంతో నాకు ఎదురుపడి ధైర్యంగా నా కళ్ళలోకి చూస్తూ మాట్లాడలేక నేను తెలంగాణకు వచ్చినపుడల్లా మొహం చాటేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కేసీఆర్‌ తెలంగాణ ప్రజల సొమ్మును కాంగ్రెస్‌ చేతిలో పెట్టారు. కేసీఆర్‌ కోరుకొన్నట్లుగానే కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిచింది. కానీ కేసీఆర్‌ ఇచ్చిన సొమ్ముని తిరిగి చెల్లించడానికి కర్ణాటక ప్రభుత్వ ఖజానా అప్పుడే ఖాళీ అయిపోతోంది. అక్కడ గెలిచిన్నట్లే ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలు కలిసి బీజేపీని దెబ్బతీయాలనుకొంటున్నాయి,” అని మోడీ ఆరోపించారు.


Related Post