ఓటుకు నోటు కేసులో కదలిక... దేనికి సంకేతం?

October 03, 2023


img

మళ్ళీ 8 ఏళ్ల తర్వాత తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు, కాంగ్రెస్‌ విజయావకాశాలు పెరిగినప్పుడు ఓటుకి నోటు కేసులో కదలికలు మొదలవడం యాదృచ్ఛికం అనుకోలేము. ఈరోజు సుప్రీంకోర్టులో ఈ కేసుపై విచారణ చేపట్టినప్పుడు రేవంత్‌ రెడ్డి పిటిషన్‌ను కొట్టేసింది. తద్వారా తెలంగాణ ఏసీబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లయింది.

కనుక ఏసీబీ మళ్ళీ విచారణ పేరుతో రేవంత్‌ రెడ్డిని పిలవడం మొదలుపెడితే, ఆ కేసులో అరెస్ట్ చేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి?అని ఆలోచిస్తే, వెంటనే కొత్త పిసిసి అధ్యక్షుడిని నియమించుకోవలసి రావచ్చు. అదే కనుక జరిగితే ఆ పదవి కోసం కాంగ్రెస్‌ నాయకులు మళ్ళీ కుమ్ములాడుకోవడం కూడా ఖాయమే. 

వారు కుమ్ములాడుకొంటే నష్టపోయేదెవరు?లబ్ధి పొందేదెవరు? అని ఆలోచిస్తే బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలే అని వేరే చెప్పక్కరలేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు రేవంత్‌ రెడ్డిని తెలంగాణ ఏసీబీ అధికారులు విచారించకపోయినా, అరెస్ట్ చేయకపోయినా, ఓటుకి నోటు కేసులో ఈపాటి కదలికలు చాలు కాంగ్రెస్‌ పార్టీపై బురద జల్లడానికి... ప్రజలలో అపనమ్మకం ఏర్పడటానికి. 

కనుక కాంగ్రెస్‌ పార్టీని దెబ్బ తీయడానికే బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు కుమ్మకు అయ్యాయనే కాంగ్రెస్‌ నేతల వాదనలకు ఈ తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నట్లే ఉన్నాయి.


Related Post