తెలంగాణ కాంగ్రెస్‌కు కాస్త సంతోషం కాస్త బాధలు

October 02, 2023


img

గత 9 ఏళ్ళుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నానాటికీ బలహీనపడుతూనే ఉంది తప్ప కోలుకోలేకపోయింది. రేవంత్‌ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత చాలా దూకుడుగా నడిపించినప్పటికీ పార్టీలో సీనియర్లు ఆయన నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో చాలా ఇబ్బంది పడ్డారు.

బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ దూసుకుపోతుండటంతో కాంగ్రెస్‌ మూడో స్థానంలోనే ఉండిపోయేది. అయితే బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం బండి సంజయ్‌ని ఆ పదవిలో నుంచి తప్పించడం, కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో హటాత్తుగా తెలంగాణలో కాంగ్రెస్‌కు అనుకూలవాతావరణం ఏర్పడి మళ్ళీ రెండో స్థానంలోకి దూసుకు వచ్చేసింది. 

ఇది చూసి ఇతర పార్టీల నేతలందరూ కాంగ్రెస్‌లోకి క్యూకట్టారు. కాంగ్రెస్‌ కూడా వెంటపడి చాలామందిని తెచ్చుకొంది. కాంగ్రెస్‌ పార్టీలో అందరూ చేరుతుండటంతో ఈసారి ఎన్నికలలో గెలవడం ఖాయమనే నమ్మకం ఏర్పడింది.

పొంగులేటి, జూపల్లి, మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ ఇంకా చాలా మందికి టికెట్స్ ఇస్తామనే హామీతోనే కాంగ్రెస్‌లో చేరారు. బయట నుంచి వచ్చి పార్టీలో చేరినవారందరికీ టికెట్స్ ఇస్తుండటంతో ఇంతకాలం పార్టీలో వాటి కోసం ఓపికగా ఎదురుచూస్తున్న నేతలందరూ తీవ్ర అసహనం, అసంతృప్తిగా ఉన్నారు. 

జూపల్లికి టికెట్ ఇచ్చి తనను పక్కన పెట్టినందుకు కొల్లాపూర్ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి జగదీశ్వర్ రావు అలిగారు. మైనంపల్లి రోహిత్ కోసం తనను పక్కన పెట్టినందుకు మెదక్ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.

ఇంకా చాలా మంది కాంగ్రెస్‌ నేతలు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు. గెలుపు గుర్రాల వంటి నాయకులు వచ్చారని సంతోషించాలో, లేక వారి కారణంగా చిరకాలంగా కాంగ్రెస్‌లో ఉన్న నేతలు బయటకు పోతున్నందుకు బాధపడాలో తెలీని పరిస్థితి కాంగ్రెస్‌లో నెలకొంది.


Related Post