తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఎన్నికలకు ముందు రాజకీయనాయకుల పార్టీ ఫిరాయింపులు సహజమే కానీ తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడి, బీజేపీ బలపడిన తర్వాత ఇక కాంగ్రెస్ పని అయిపోయిందనుకొంటే, ఎన్నికలకు ముందు హటాత్తుగా మళ్ళీ బలపడటం ఆశ్చర్యకరమే.
ఇప్పుడు అందరూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కాదని కాంగ్రెస్‌లోకి క్యూకట్టడం చూస్తే ఈసారి ఎన్నికలలో దానికి విజయావకాశాలున్నాయని వారు భావిస్తున్నట్లనుకోవచ్చు.
ఇటీవల బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మెదక్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆయన కుమారుడు రోహిత్, వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్‌లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారు నలుగురూ నిన్న ఢిల్లీ వెళ్ళి ఆయన నివాసంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు.
ఇటీవల కాంగ్రెస్‌లో చేరినవారిలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. వీరందరూ గెలుపు గుర్రాలే కనుక ఆయా స్థానాలలో బిఆర్ఎస్ అభ్యర్ధులకు గట్టి పోటీ ఇవ్వబోతున్నారు.