త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో మళ్ళీ గెలిచేందుకు సిఎం కేసీఆర్ తన ముందు ప్రతీ అవకాశాన్ని తెలివిగా వినియోగించుకొంటున్నారు. హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తయ్యి చాలాకాలమే అయినప్పటికీ ఇంతకాలం వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా జాప్యం చేస్తూ, ఇప్పుడు ఎన్నికల గంట మోగే ముందు పంచిపెడుతున్నారు. తద్వారా లబ్ధిదారుల కుటుంబాలు, బంధుమిత్రుల ఓట్లన్నీ కూడా బిఆర్ఎస్ పార్టీకే పడేలా చేసుకోగలుగుతున్నారు.
గ్రేటర్ పరిధిలో గల 24 శాసనసభ నియోజకవర్గాలలో ప్రభుత్వం 36,907 ఇళ్ళను నిర్మించింది. వాటికె ఎంపికైన లబ్ధిదారుల పేర్లను నేడు ప్రకటించనున్నారు.
హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని లక్కీ డ్రాలో ఎంపికైన లబ్ధిదారుల పేర్లను ప్రకటిస్తారు. వారికి అక్టోబర్ 3,5 తేదీలలో అంటే... ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా ఇళ్ళ పత్రాలు, తాళం చెవులు అందజేస్తారు. ఈ లక్కీ డ్రాలో అటువంటి అవకతవకలకు తావీయకుండా కంప్యూటర్ ద్వారానే తీసి లబ్ధిదారుల పేర్లను ప్రకటిస్తారు.
ఇప్పటికే 24 నియోజకవర్గాలలో 11,700 మంది లబ్ధిదారులకు ఇళ్ళు అందజేశారు. ఇప్పుడు మరో 36,907 మందికి అందజేయబోతున్నారు. ఒక్కో లబ్ధిదారు ఇంట్లో కనీసం ముగ్గురు ఓటర్లే ఉన్నారనుకొన్నా వారందరివీ కలిపి లక్షన్నరకు పైగా ఓట్లు బిఆర్ఎస్ పార్టీకి పడిపోయిన్నట్లే! ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు.